3, జనవరి 2011, సోమవారం

స్వచ్చమైన ప్రేమ

స్వచ్చమైన ప్రేమ (మీ హృదయాన్ని కదిలించే కథ)


అమెరికాకు చెందిన ఒక సైనికుడు వియత్నాంలో యుద్ధం
ముగించుకుని తన స్వస్థలానికి  తిరిగి వస్తున్నాడు.దారిలో   వస్తూ వస్తూ 
తల్లిదండ్రులకు ఫోన్ చేశాడు.

“అమ్మా, నేను ఇంటికి వస్తున్నాను.ఈ సందర్భంగా మిమ్మల్ని ఒక కోరిక కోరాలనుకుంటున్నాను్.”

“ఏంటి బాబూ అది?”

” నా కొక  స్నేహితుడున్నాడు. వాడిని నాతో పాటు తీసుకురావచ్చా?”

“దానికేం భాగ్యం. అలాగే తీసుకుని రా బాబూ. నేనూ మీ నాన్న నువ్వు ఎప్పుడెప్పుడు వస్తావా అని వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నాం”

“కానీ మీరు ఇంకొక విషయం కూడా తప్పకుండా తెలుసుకోవాలి. నా స్నేహితుడు
యుద్ధంలో తీవ్రంగా గాయపడ్డాడు. మందుపాతర మీద పడడం వల్ల అతను ఒక చెయ్యి,
కాలూ కోల్పోయాడు.అతనికి నా అన్నవాళ్ళెవరూ లేరు. ఎక్కడికీ వెళ్ళలేడు. అతన్ని
మనతో పాటే ఉంచుకుందామని నా కోరిక.”

“ఎంత పని జరిగింది నాయనా! అలాగే తీసుకునిరా. అతనికి ఎక్కడో ఒక దగ్గర నివసించడానికి ఏర్పాట్లు చేద్దాం”

“కానీ అమ్మా! అతన్ని మనతో పాటే ఉంచుకోవాలని నా కోరిక”

తండ్రి అందుకుని “నాన్నా! ఒక వికలాంగుని మనతో పాటు ఉంచుకోవాలంటే అది ఎంత
భారమో నీకు అర్థం కావడం లేదు. మన జీవితాలు మనవి. వేరే వాళ్ళ కష్టాలు కూడా
మనం నెత్తిన వేసుకోవాల్సిన అవసరం లేదు. నువ్వు మాత్రం అవన్నీ మనసులో
ఉంచుకోకుండా జాగ్రత్తగా ఇంటికి వచ్చెయ్. అతను ఎలాగోలా బ్రతగ్గలడులే”

అన్నాడు.

అవతలి వైపు నుంచి ఫోన్ కట్ అయిన శబ్దం వినిపించింది.

తరువాత కొడుకు దగ్గర్నుంచి వాళ్ళకి ఎలాంటి ఫోనూ రాలేదు. కొద్దిరోజుల
తర్వాత, శాన్‌ఫ్రాన్సిస్కో పోలీసుల నుంచి ఆ దంపతులకు ఒక సమాచారం అందింది.
దాని సంగ్రహం ఏమిటంటే వాళ్ళ కొడుకు ఒక భవనం పై నుంచి క్రిందపడి మరణించాడు.
పోలీసులు దాన్ని ఆత్మహత్యగా భావిస్తున్నారు.

పుట్టెడు దు:ఖంలో మునిగిపోయిన ఆ తల్లిదండ్రులను పోలీసులు శవాన్ని
గుర్తించడానికి మార్చురీకి తీసుకుని వెళ్ళారు.వాళ్ళు ఆ వ్యక్తిని తమ
కుమారుడి గుర్తించారు. కానీ వాళ్ళకు ఇంకొక భయంకరమైన నిజం కూడా తెలిసింది.
తమ కుమారుడికి ఒక చెయ్యి, కాలు లేవని.
స్వచ్చమైన ప్రేమ అంటే ఎలా ఉండాలో(ఉండకూడదో) ఈ కథ చదివిన తర్వాతే నాకు
అర్థం అయింది.ఇది మీ హృదయాన్ని కూడా  తాకి ఉంటే మీ  అభిప్రాయాలు తప్పక
పోస్టు చెయ్యండి.

కామెంట్‌లు లేవు: