అలా నీలోకి
ఒక వాక్యతరగనై ప్రవహించాలన్నా
నీ కనురెప్పల కింద
కలా విచిత్రమై దోబూచులాడాలన్నా
నీ నాలుక చివర
తేనెతుట్టెనై పూర్ణించుకోవాలన్నా
నేను నిప్పుల మీద సలసల మరిగే కన్నీరవ్వాల్సిందే
నీ పక్కన మూగి
బుడిబుడి అడుగుల ధ్వని సరాగం వినిపించాలన్నా
నీ ఉసూరనే వేళల
సన్నని వానతుంపరై చక్కిలిగిలి పెట్టాలన్నా
నీ పాదాలలసిన తొవ్వల
చెమటనద్దే పాటగా స్పృశించాలన్నా
నేనీ మట్టి పొరల కింద రాచి రంపాన పెట్టుకోవల్సిందే.
నీ చెంప కానించిన కొనగోటి సమయాల్లోకి
దుర్లభ కలిసమయమై దూరాలన్నా
నీ ముడేసిన పెదాల వృత్తంలో
శబ్దాలంకారమై పులుముకోవాలన్నా
చంద్రాంశ తొంగి చూడని నీ ముఖ వర్ఛస్సులో
వేయి పున్నముల పోయెయై నిండిపోవాలన్నా
ఎన్నో కాళరాత్రుల కొరడాలతో
హింసింపబడాల్సిందే.
నీ తల మీద మోస్తున్న జ్ఞాపకాల బుట్టలోకి
మధురోహనై తొంగి చూడాలన్నా
నీ కనుకొనల జారిన భాష్పవలయం చుట్టూ
పరితప్త కందిరీగనై గిరికీలు కొట్టాలన్నా
నీ చాచిన చెయ్యిలోంచి
భవిష్యత్ మాధుర్యాలను కలుగునై తోడుకోవాలన్నా
జుట్టు పట్టుకుని, సముద్రంలోకి లాక్కెళ్లి
నన్ను నేను వందసార్లు ముంచుకోవల్సిందే.
నీ నుదురొక అరణ్యమై విస్తరిస్తే
విల్లెక్కుపెడుతున్న బంజారాగీతమై
కలియ తిరగాలన్నా
నీ హృదయమెక్కడో కాట గలిసిపోతే
దారుల దిగ్బంధనంలో
పోగయ్యే సామూహిక వేదనాభరిత వేదికపై
నిన్ను కనుగొనాలన్నా
జీవితమెక్కడో కుంటుతున్న కుక్కపిల్లై
కాళ్లకడ్డం పడితే
అమ్మ కడుపులోకెళ్లి మమకారాన్నింత మోసుకురావాలన్నా
నాకు నేనే పుల్లలు పుల్లలుగా విరుచుకొని
కట్టగట్టుకొన్న మోపుగా
కొత్తగా అవతరించాల్సిందే.
ఇప్పుడు చెప్పనా
నువ్వెవరివో
నేనెవరినో
నువ్వు
నూరంకెలు లెక్కబెడుతున్న బతుకు చుట్టూ
మూగిన ఆశయానివి
నీ అడుగులకు
మరింత నూరేళ్ల బలాన్నద్దుతున్న నేను
శిల్పాన్ని...!
గుర్తు దొరక్కుండా...
సిహెచ్.వి.బృందావనరావు
ఇప్పుడు మనిషి నెవరూ
బంధించి ఉంచలేరు
సమూహాన్ని చించేసి
ఒంటరితనాన్ని ఒంటికి తొడుక్కొని
నాణేలను ఏరుకుంటూ
నడిచిపోతున్న మనిషినిప్పుడు
ఏ ఆపేక్షుల మోకులూ బంధించలేవు
ఏ ప్రణయబంధాలూ ఆపి వుంచలేవు
కనుచూపుల వేదికలకు
కలల యవనికల్ని వేలాడేసుకొని
తెరల వెనకాల ఉన్నదనుకొన్న ఏదో
తెలియని గమ్యం కోసం
అక్షాంశాల ఆవలికి
ఆశగా పరిగెత్తిపొయ్యే మనిషినిప్పుడు
ఏ కన్న పేగులూ కట్టి పడెయ్యలేవు
ఏ కన్నీటి వాగులూ నిలిపి ఉంచలేవు
ఇప్పుడు మనిషిని పోలిక పట్టడం కూడా
ఏమంత సులభం కాదు
అడవిలోని లేళ్ల మందల్లాగానో
ఆకాశంలోని గువ్వల బారుల్లాగానో
మనిషిప్పుడు తన జాతి జనంతో
జీవించడం మరిచిపోయాడు
ఆశల శిథిలాల అట్టడుగుల
అనగా అనగా ఓ కథగా మిగిలిపొయ్యాడు
అనాధగా ప్రవహిస్తూ
అందని ఏ సముద్రం కోసమో
గునగునా పారే మనిషినిప్పుడు
గుర్తు పట్టడం కూడా వీలుకాదు.
సుగుణ గంగ!
గుర్రాల రమణయ్య
పూయమంటే మొక్క పూయదు
కాయమంటే చెట్టు కాయదు
యాసిడ్ బాటిళ్ల భయంలో
ప్రేమెలా పుట్టుకొస్తుంది
ఆగమంటే యేరు ఆగదు
వద్దంటే రాత్రి రాక మానదు
శాంతి గీతం ఆలపించగనే
పిడికిలెలా విప్పుకుంటుంది!
కాలమే కత్తుల వంతెనపైన
కవాత నడకలు నడుస్తుంటే
మనం ఎత్తిన ప్రతి అడుగూ
పూలపైన నడుస్తున్నట్టుండాలి!
గుండెల్ని దోసిట్లో పట్టుకొని
గుబులు పొదల మాటునుండి
సెకన్ల ముల్లులా అడుగడుగూ వేస్తూ
గూడుదాకా చేరుకోవాలి
మనిషిని మనిషిగా ప్రేమించటం
మరిచిపోయిన క్షణాన్నుంచే
దౌర్జన్యం సంకెళ్లు తెరచుకుంది
దుర్మార్గం ఒళ్లు విరుచుకుంది
ఇప్పుడిక వ్యాపారంలా కాదు
జీవితాన్ని అలాయి-బలాయిల
దృక్కోణం నుండి చూడాలి
మనసుల్ని పుస్తకంలా పరిచి
అందరికీ మమతల పాఠాలు నేర్పాలి
మనిషి గుండెల్లో చొరబడిన
కాలుష్య లక్షణాలని కడిగేయాలి
వాతావరణ కాలుష్యాన్ని నిరోధించి
నేలపై పచ్చని చిరునవ్వుల కోసం
మనిషి సుగుణ గంగలో మునకేయాలి!
ఒక వాక్యతరగనై ప్రవహించాలన్నా
నీ కనురెప్పల కింద
కలా విచిత్రమై దోబూచులాడాలన్నా
నీ నాలుక చివర
తేనెతుట్టెనై పూర్ణించుకోవాలన్నా
నేను నిప్పుల మీద సలసల మరిగే కన్నీరవ్వాల్సిందే
నీ పక్కన మూగి
బుడిబుడి అడుగుల ధ్వని సరాగం వినిపించాలన్నా
నీ ఉసూరనే వేళల
సన్నని వానతుంపరై చక్కిలిగిలి పెట్టాలన్నా
నీ పాదాలలసిన తొవ్వల
చెమటనద్దే పాటగా స్పృశించాలన్నా
నేనీ మట్టి పొరల కింద రాచి రంపాన పెట్టుకోవల్సిందే.
నీ చెంప కానించిన కొనగోటి సమయాల్లోకి
దుర్లభ కలిసమయమై దూరాలన్నా
నీ ముడేసిన పెదాల వృత్తంలో
శబ్దాలంకారమై పులుముకోవాలన్నా
చంద్రాంశ తొంగి చూడని నీ ముఖ వర్ఛస్సులో
వేయి పున్నముల పోయెయై నిండిపోవాలన్నా
ఎన్నో కాళరాత్రుల కొరడాలతో
హింసింపబడాల్సిందే.
నీ తల మీద మోస్తున్న జ్ఞాపకాల బుట్టలోకి
మధురోహనై తొంగి చూడాలన్నా
నీ కనుకొనల జారిన భాష్పవలయం చుట్టూ
పరితప్త కందిరీగనై గిరికీలు కొట్టాలన్నా
నీ చాచిన చెయ్యిలోంచి
భవిష్యత్ మాధుర్యాలను కలుగునై తోడుకోవాలన్నా
జుట్టు పట్టుకుని, సముద్రంలోకి లాక్కెళ్లి
నన్ను నేను వందసార్లు ముంచుకోవల్సిందే.
నీ నుదురొక అరణ్యమై విస్తరిస్తే
విల్లెక్కుపెడుతున్న బంజారాగీతమై
కలియ తిరగాలన్నా
నీ హృదయమెక్కడో కాట గలిసిపోతే
దారుల దిగ్బంధనంలో
పోగయ్యే సామూహిక వేదనాభరిత వేదికపై
నిన్ను కనుగొనాలన్నా
జీవితమెక్కడో కుంటుతున్న కుక్కపిల్లై
కాళ్లకడ్డం పడితే
అమ్మ కడుపులోకెళ్లి మమకారాన్నింత మోసుకురావాలన్నా
నాకు నేనే పుల్లలు పుల్లలుగా విరుచుకొని
కట్టగట్టుకొన్న మోపుగా
కొత్తగా అవతరించాల్సిందే.
ఇప్పుడు చెప్పనా
నువ్వెవరివో
నేనెవరినో
నువ్వు
నూరంకెలు లెక్కబెడుతున్న బతుకు చుట్టూ
మూగిన ఆశయానివి
నీ అడుగులకు
మరింత నూరేళ్ల బలాన్నద్దుతున్న నేను
శిల్పాన్ని...!
గుర్తు దొరక్కుండా...
సిహెచ్.వి.బృందావనరావు
ఇప్పుడు మనిషి నెవరూ
బంధించి ఉంచలేరు
సమూహాన్ని చించేసి
ఒంటరితనాన్ని ఒంటికి తొడుక్కొని
నాణేలను ఏరుకుంటూ
నడిచిపోతున్న మనిషినిప్పుడు
ఏ ఆపేక్షుల మోకులూ బంధించలేవు
ఏ ప్రణయబంధాలూ ఆపి వుంచలేవు
కనుచూపుల వేదికలకు
కలల యవనికల్ని వేలాడేసుకొని
తెరల వెనకాల ఉన్నదనుకొన్న ఏదో
తెలియని గమ్యం కోసం
అక్షాంశాల ఆవలికి
ఆశగా పరిగెత్తిపొయ్యే మనిషినిప్పుడు
ఏ కన్న పేగులూ కట్టి పడెయ్యలేవు
ఏ కన్నీటి వాగులూ నిలిపి ఉంచలేవు
ఇప్పుడు మనిషిని పోలిక పట్టడం కూడా
ఏమంత సులభం కాదు
అడవిలోని లేళ్ల మందల్లాగానో
ఆకాశంలోని గువ్వల బారుల్లాగానో
మనిషిప్పుడు తన జాతి జనంతో
జీవించడం మరిచిపోయాడు
ఆశల శిథిలాల అట్టడుగుల
అనగా అనగా ఓ కథగా మిగిలిపొయ్యాడు
అనాధగా ప్రవహిస్తూ
అందని ఏ సముద్రం కోసమో
గునగునా పారే మనిషినిప్పుడు
గుర్తు పట్టడం కూడా వీలుకాదు.
సుగుణ గంగ!
గుర్రాల రమణయ్య
పూయమంటే మొక్క పూయదు
కాయమంటే చెట్టు కాయదు
యాసిడ్ బాటిళ్ల భయంలో
ప్రేమెలా పుట్టుకొస్తుంది
ఆగమంటే యేరు ఆగదు
వద్దంటే రాత్రి రాక మానదు
శాంతి గీతం ఆలపించగనే
పిడికిలెలా విప్పుకుంటుంది!
కాలమే కత్తుల వంతెనపైన
కవాత నడకలు నడుస్తుంటే
మనం ఎత్తిన ప్రతి అడుగూ
పూలపైన నడుస్తున్నట్టుండాలి!
గుండెల్ని దోసిట్లో పట్టుకొని
గుబులు పొదల మాటునుండి
సెకన్ల ముల్లులా అడుగడుగూ వేస్తూ
గూడుదాకా చేరుకోవాలి
మనిషిని మనిషిగా ప్రేమించటం
మరిచిపోయిన క్షణాన్నుంచే
దౌర్జన్యం సంకెళ్లు తెరచుకుంది
దుర్మార్గం ఒళ్లు విరుచుకుంది
ఇప్పుడిక వ్యాపారంలా కాదు
జీవితాన్ని అలాయి-బలాయిల
దృక్కోణం నుండి చూడాలి
మనసుల్ని పుస్తకంలా పరిచి
అందరికీ మమతల పాఠాలు నేర్పాలి
మనిషి గుండెల్లో చొరబడిన
కాలుష్య లక్షణాలని కడిగేయాలి
వాతావరణ కాలుష్యాన్ని నిరోధించి
నేలపై పచ్చని చిరునవ్వుల కోసం
మనిషి సుగుణ గంగలో మునకేయాలి!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి