13, అక్టోబర్ 2012, శనివారం

కంటి దోషమా?

ప్రత్యూష హిమబిందువుల అందాలు కనిపించవు నాకు.
టీ కొట్టుముందు బెంచీలు తుడిచే చిరుగు చెడ్డీ బుడ్దోడే కనిపిస్తాడు.

నిద్రలేస్తూనే ఏ ప్రభాతగీతాలూ వినిపించవు నాకు, 
ఆరేళ్ళ చిన్నది బంగాళామెట్లు తుడిచే చీపురు చప్పుడే వినిపిస్తుంది.

యజమానివెంట వాకింగ్ చేసే బొచ్చుకుక్కల విన్యాసాలు కనిపించవు నాకు,
పాచిపోయిన అన్నం కతికి కక్కుకునే బక్కకుక్కలే కనిపిస్తాయి.

స్కూలు బస్సులో వెళ్ళే పావురాళ్ళలా ఉన్న పసి పిల్లలు కనిపించరు నాకు
మెకానిక్ షెడ్డులో స్పానరుదెబ్బలు తినే మరకలంటిన పసి మొఖాలు కనిపిస్తాయి.

భాగ్యవంతులిచ్చే విందులో పళ్ళూ , పలహారాలూ కనిపించవు నాకు,
ఎంగిలి ఇస్తర్లలో కుక్కలతో కలబడి కతికే నిర్భాగ్యులే కనిపిస్తారు.

కారులో తిరిగే కలవారి ఆడబిడ్డల సుకుమారం కనిపించదు నాకు,
సిమెంటులో పనిచేసే ఆడకూలీ అరిగిపోయిన కాళ్ళే కనిపిస్తాయి.

అట్టహాసంగా సీమంతం చేసుకొనే సినీతారలు కనిపించరు నాకు,
నెత్తిమీద తట్టనెత్తుకొని నిచ్చెనెక్కే నిండు చూలాలే కనిస్పిస్తుంది.

బాబు సంపాదిస్తే బలాదూర్ గా తిరిగే బడుద్దాయిల డాబు కనిపించదు నాకు 
బతుకు పుస్తకానికి భవిత అట్టలేసుకొనే మధ్యతరగతి యువతే కనిపిస్తుంది.

వనోత్సవంలో అరటిఆకులో తెల్లటి మల్లిపూలంటి వరియన్నం కనిపించదు నాకు
పురుగుల మందు తాగిన రైతన్న నోటివెంట వచ్చే తెల్లటి నురగే కనిపిస్తుంది 

నా కంటిపాపల నిండా ఒలికిన జీవిత విషాదాలే,
నా చెవుల నిండా తెగిన కంఠ మూగరోదనలే,

నాకీ ప్రపంచమంతా వింతగా కనిపిస్తుంది,,అందమైన అద్దంలో వికృత రూపంలా..

కామెంట్‌లు లేవు: