29, ఫిబ్రవరి 2012, బుధవారం

నా గుండెలోనే గుట్టుగా నిక్షిప్తమై పోనీ..ఎన్నటికీ తీరని ఈ నా ప్రేమ వ్యధని..

ప్రియతమా..
పిడికెడు నీ ప్రేమ కోసం
నా మౌనహృదయం
ఎన్నో వసంతాలుగా ఎదురు చూస్తోంది..
నీ దయ నా మీద ప్రసరించదని తెలుసు..
... నువ్వొక అందని అందమైన జాబిల్లివని తెలుసు..
నిన్ను నేను పొందలేనని తెలుసు..
అన్నిటికంటే ముందు నా దురదృష్టం
నిన్ను ఖచ్చితంగా నాకు దక్కనీయదనీ తెలుసు..
అయినా నిన్ను ప్రేమించకుండా నేను ఎలావుండగలనూ ..?
ఇన్నాళ్ళూ నిన్ను ఆరాధించడం లో
నేను పొందిన మధురానుభూతిని
ఒక్క సారిగా నా మదిలోనుంచి
ఎలా తుడిచివేయగలనూ.. ?
నా నరనరాల్లో జీర్ణించుకు పోయిన నీ ప్రేమని
ఉన్నపాటున ఎలా చంపుకోగలనూ..?
నీకోసం.. నీ ప్రేమకోసం..
నా హృదయం ఎంతగా తపిస్తోందో..
ఎంతగా విలపిస్తోందో.. నీకు తెలియదు..
నువ్వు నాకు ఎప్పటికీ..కనిపించక పోయినా..
నేను నిన్ను ఎప్పుడూ కోరేది ఒక్కటే ప్రియా..
కనీసం నిన్ను ప్రేమించడం లో వున్న
అంతులేని ఆనందాన్ని..
చెప్పలేని మాధుర్యాన్నీ.. అయినా
నన్ను ఇలా కాసేపు అనుభవించనీ..
నిన్ను పొందలేక పోయాననే తీరని కోరికని
నా గుండెలోనే గుట్టుగా నిక్షిప్తమై పోనీ..
ఎన్నటికీ తీరని ఈ నా ప్రేమ వ్యధని..
నీ తీయని విరహబాధనీ..
నా జీవితకాలమంతా..
విడవక నన్ను భరించనీ..
ఈ జన్మకిలా తరించనీ..
ప్లీజ్.............

16, ఫిబ్రవరి 2012, గురువారం

మొలకెత్తుతూనే వుంటుంది!!

ఆమెను
అనువదించే
సాధనముంటే ఎంత బాగుణ్ణు!!

అనుభవమొక్కటే
తుది కాకూడని
అనంత సాగర మధనం!!

చివరిగా
ఊపిరి నిలిపిన చోట
మొలకెత్తుతూనే వుంటుంది!!

4, ఫిబ్రవరి 2012, శనివారం

"తలపెందుకని?"

సూటిగా అడిగాను మనసుని
ఈ ఒంటరితనం నాకెందుకని?
మనసు బదులు చెప్పలేనని
నిన్ను తలచింది ఎందుకని?
శ్వాసలేనిదే నేను లేనని
తెలిసి శ్వాసలో నీవెందుకని?
ఊపిరిని బిగపట్టాను ఆగమని
తన్నుకొచ్చింది నీతలపు ఎందుకని?
నీ తలపుల లేత కలువలని
మనఃసరోవరంలో విసిరావెందుకని?
తలపుల తడి ఆరనే లేదని
తెలిసినా దాహం తీరదు ఎందుకని?
నిన్ను మరచి పోవాలని
వేడుకుంటున్నా నిన్నేందుకని?
తలచినాను నిన్ను మరచితినని
కానీ మరింత దగ్గరైనావు ఎందుకని?

నువు గుర్తుకు వచ్చినప్పుడల్లా


ఉప్పెనై వస్తావు ఊహలకేమీ మిగల్చక ఊడ్చుకెళతావు
అంతటా నీవే ఆవహిస్తావు ఆసాంతం ఆక్రమిస్తావు
గుర్తుకు వచ్చినప్పుడల్లా గుండెను గాయపరచి వెళుతుంటావు

అయినా నా పిచ్చి గానీ...
నీవు లేనిదెప్పుడనీ నా ఊహల్లో!?
వెలుపల వెలుగై కనిపించేదీ నువ్వే
అంతరాన ఆరని మంటైనదీ నువ్వే!
అంతగా ఆక్రమించావు నన్ను

అయినా అమాయకంగా అనుకుంటాను...
నిన్ను నా గుండె గదిలో బంధించేశానని...
ఇక బయటకు రాలేవని...
నా ఊహలకు అడ్డు రావని...

ఈ కుల మతాల కుట్రకు బలియై పోయాను
చుట్టూ ఉన్న ప్రపంచానికి భయపడి
పిరికి వాడిలా మిగిలిపోయాను నీదృష్టిలో...

పిచ్చి వాడినే కదా మరి..!?
నీ ప్రేమను అందుకో లేక పోయిన కుల పిచ్చివాడిని

అయినా ఏ మంత్రం వేశావో తెలియదు
నా మది తలపుల తలుపులు ఛేదించుకు వచ్చినప్పుడల్లా
నీ ఊహలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి
ఉవ్వెత్తున ఎగసే అలలై కల్లోలం సృష్టిస్తాయి

లోకం దృష్టిలో నిన్ను కాదనుకున్నా
నా వరకు నెటికీ నీతోనే ఉంటున్నా
బహుశా అందుకేనెమో!?
ఎవ్వరికీ అందంకుండా నాలోనేనే ఒంటరిగా మిగిలిపోతున్నా

కులం గొప్పదా? ప్రేమ గొప్పదా? అన్న చిన్న ఆలోచనవచ్చి అది ఆవేశమై ఏదో రాశేశా...

మధురిమను ఎలా వర్ణించను నేస్తం?


నీ స్నేహంలోని  మధురిమను ఎలా వర్ణించను నేస్తం?
తేనె జలపాతాలతో, వెండి మబ్బుల గుంపుతో,
శరత్ జ్యోత్స్నలతో, పూల దామాలతో , మోహన రాగంతో,
దేనితోను సరిపోని తుషార పరంపర నీ  చెలిమి !

నా ఆనందం


నిన్ను చూసిన క్షణం నా ఆనందం
అక్షరాలలో అభివర్ణించేది కాదు
అందుకు బదులుగా
నక్షత్రాలన్నీ నింగినుండి పోగుచేసి
నీపై కురిపించాలనివుంది
నిండు చంద్రుడిని ముప్పవు ముక్క విరిచి
కర్పురంలా వెలిగించి నీకు దిష్టి తియ్యాలనివుంది
ఇంద్రధనుస్సుని తెచ్చి
నీ పసిపాదాలు కందకుండా తివాచిలా పరచాలనివుంది
మేఘాలన్నీ చెరిపేసి ఆకాశాన్ని మడతపెట్టి
నీ పానుపులా మార్చాలనివుంది
ఒక్క మాటలో
నా ఆనందాన్ని రెట్టింపు చేసి
నీకు అందిచాలనివుంది నా అనుబంధమా

ఓ ఆకు..


పచ్చని ఆకు పొడిబారే
యవ్వన సోయగానికి ఎండ తాకే'...
శిశిరం ఇది సారం విడి పోమాకే'..
నేలను రాలినా ఎరువుగా తరువును వదులకే'..

పోయిన ప్రాణమా పునర్చిగురించుమా..
ఆమని ఋతువు ఆహ్వానం నీకురా ఓ ఆకు..
బోసి చెట్టుకు పాలపంటి పాపాయి చిగురుటాకు..
నెమ్మది వదులు  వదిగాలి వీచె సాకు తో..

పచ్చని మేని నిగలు హాయిలే మా కంటి పాపకు..
జవ్వన  గొంగళిని కోక ఆరేసిన చిలుకను చేసినావె ఓ ఆకు..
ముచ్చట గొలుపు మామిడి పిండెకు పూవుకు మొదలు నీవని తెలుసు మాకు..
మాపువేళ కట్టిన గువ్వల గూడుకు ఆధారం నీవని మరువకు..


పగిలెను రాళ్ళు చాలా ఎండకు...
నీడను ఇవ్వరా ఒంటరి బాటకు..
పందిరికి పూరిగుడిసెకు తాటాకు...
నీవేలేనిదే చిధ్రం నిరుపేద బ్రతుకు...

బువ్వను వద్దించిన విస్తరాకు...
పెళ్ళి ఇంటికి  ప్రతీక అరిటాకు..
నాళిక రంగు నాభికి ఊరట తమలపాకు..
పేరులు వేరైన మాపై అదే ప్రేమ కురిపించినావె ఓ ఆకు..

ఇది పాతబడే వరకు బతికేస్తా...


జీవితంలో ఒక ఎడాది గడిచింది...
నూతనం అంటూ మరొకటి దాపురించింది..
యాభై రెండు వారాల్లో ఉన్నవి వరాలో..
వెనకేసుకునే ఆలోచనల పునాది రాళ్ళో...
గతం ఒక ఙ్ఞాపకం ఐతే...
అది నేను మర్చిపోవాలనుకుంటున్నా....
రేపు ఎలా ఉంటుందో..ఈరోజే తెల్సుకోవాలన్న
మానవ కుతూహలంకు కట్టుబానిసను కావాలనుకోను
ఈరోజు చేతిలో నిధి జారవిడుచుకుంటున్నానా? అని ఆందోళన..
నేడు నిన్నలా ఉంటే...విలువ ఉండదు...
నిన్నటికో..నేటికో ..రేపటికో...పోయేదేముంది?..
గిర్రున్న కాలప్రవాహంలో కొట్టుకుపోతాయి..
నన్నొక ఒడ్డుకు చేర్చి పోతే బాగున్ను...
సవాల్ల మధ్యో శవాల మధ్యో మనుగిడలేక మునిగిపోతానో..
సావాసం కోరే సజీవులను కలుసుకుంటానో..
ఏదిఏమైనా కొత్త ఒక వింతగా.. ఇది పాతబడే వరకు బతికేస్తా...

నాకు చాల ఇష్టం!


ఈ పుడమి పై నే పడిన నాడు నాకిష్టం ..
నన్ను ప్రేమించే నా కుటుంబం అంటే నాకిష్టం..
నన్ను విడిచి వెళ్ళిపోయిన తొలిప్రేమ నాకిష్టం ..
నేను విడిచి ఉండలేని జన్మ బంధాలు నాకిష్టం ..
ఎల్లప్పుడూ నాటో దోబూచులాడే విజయ తిరమన్నా నాకిష్టం ..
ఎవరికీ దొరమైన ఏదో ఒక రోజు దెగ్గర అవుతాననే భావన ..
నాకు చాల ఇష్టం!

సర్వస్వం...


ఏదో తెలియని అవ్యక్త భావం
నా అంతరాలలో ఒక ఉత్తేజం
నిన్ను చూసుకుని మురిసిపోయే కాలం
నీతో గడిపిన ఆ కొద్ది సమయం
అదే నా జీవిత సర్వస్వం...

ప్రేమే..

సంధ్యా సమయాన జాలువారిన జాజిపూల సువాసన వంటిది ప్రేమ..
పిల్ల గాలికి హొయలు వొలికించే వరి చేను వంటిది ప్రేమ..
సప్తస్వరాలతో సుమధుర సంగీత స్వరార్చన వంటిది ప్రేమ..
అనురాగం కురిపించే చల్లని తల్లి చూపు వంటిది ప్రేమ..
సాధకుని షడ్చక్రాలలో నిండి ఉన్న సంకల్పబలం వంటిది ప్రేమ..
ఆనందమయమైన జీవితాన్ని అందముగా రుచి చూపించేది ప్రేమ ..
గాయపడిన మనసుని అక్కున చేర్చుకుని సాంత్వనపరిచేది ప్రేమ..
మనిషిని తాను ఇంకా మనిషినే అని నిరూపించుకునేలా చేసేది..
ప్రేమే..

స్వయంకృతం

కారడవిని సైతం కబలించి
మహా వృక్షాలను పెకలించి
సమతుల్యనికి తూట్లు పొడిచి
ప్రకృతి ధర్మాన్ని మరచి
గడుపుతున్నాము ఈ సమయం
ఇది మనం చేసుకున్న స్వయంకృతం
గతితప్పిన గమ్యం
మతిలేని పయనం
ప్రతి రొజూ భయం
మన చుట్టూ నరకం
అయినా
గడుపుతున్నాము ఈ సమయం
ఇది మనం చేసుకున్న స్వయంకృతం
ఆధ్యాత్మికత పేరుతో అపచారం
ఆరోగ్యం పేరుతో వ్యాపారం
మోసగించే సమాజం
మోసపోవుట సహజం
అనుకుని
గడుపుతున్నాము ఈ సమయం
ఇది మనం చేసుకున్న స్వయంకృతం
పడ్డ వాడు చెడ్డ వాడు కాదు
చెడ్ద వాడు పడిపోక తప్పదు
మంచి చెడుల సంగ్రామం ఆగదు
ఆఖరికి మంచి జరగక మానదు
అనుకుని
గడుపుతున్నాము ఈ సమయం
ఇది మనం చేసుకున్న స్వయంకృతం

మలినం

వీచే చల్లని గాలి మలినం
పూచే అందమైన పువ్వు మలినం
గల గల పారే ఏరు మలినం
నదిలో ప్రవహించే నీరు మలినం
తడిచే నేల మలినం
పండే చేను మలినం
తినే కూడు మలినం
అరాయించే కుక్షి మలినం
ప్రపంచాన్ని చూసే కళ్ళు మలినం
ప్రాపంచిక విషయాలకై వళ్ళు మలినం
మనిషి యుక్తి మలినం
దేవుని పై భక్తి మలినం
ఎన్ని మలినమైనా మనసు పవిత్రం..
ఆత్మసాక్షాత్కారానికి అదే మార్గాదర్శకం..

ప్రేమ చలువే

మనసు పడినా
మనసు చెడినా
అది ప్రేమ చలువే

విజయ తీరం దరిచేర్చినా
పరాజయపు అగాథాలు చవిచూసినా..
అదీ ప్రేమ చలువే
కాలం కలసివచ్చినా
కాలగర్భంలో కలసిపోయినా
అదీ ప్రేమ చలువే

మోముపై చిరునవ్వులు చిందించినా
ఎరుపెక్కిన కంట నీరు తెప్పించినా
అది ప్రేమ చలువే

అర్థం చేసుకున్నా
అపార్థానికి చేరువైనా
అదీ ప్రేమ చలువే

కల నెరవేరినా
అలగా కరిగిపోయినా
అది ప్రేమ చలువే

ఒంటరిగా ఉన్నా! అందరినీ నీ దరి చేర్చినా
అందరూ ఉన్నా ! నువు ఓంటరి అయినా
అది ప్రేమ చలువే

ప్రపంచమంతా ప్రేమమయమైనా
ప్రేమ ఈ ప్రపంచం నుండి దూరమైనా
అది కూదా "ప్రేమ చలువే"

3, ఫిబ్రవరి 2012, శుక్రవారం

ఇంత అల్లరిదమ్మ ఈ వాన


ఇంత అల్లరిదమ్మ ఈ వాన
ముదుముద్దుగ జల్లులు కురుస్తుంది
మనసు తడిసేలా, తనువు పులకరించేలా
ముత్యాలంటి చినుకులు
మేమున్నామని ఊసులాడితే
నా పెదవుల పైన చిరునవ్వొకటి మెరిసింది.

ఇన్నిరోజులూ ఏమయ్యావని
పలుకరిస్తే మబ్బు చాటున దాగాను,
నీతో దాగుడుమూతలాడాలని,
లేత ఆకుపై జారాను,
ఇప్పుడు నిన్ను చేరాలని,
సూర్య కాంతిలో మెరిశాను,
నువ్వు నన్ను గుర్తు పట్టాలని.

నువ్వు సంధించే వర్ణాస్త్రం
నా ఎదను ఛేదిస్తే
కనిపించిందట నీ పేరే
నెలరాజునకు… గుడ్లప్పగించి చూశాడు.
అగుపించిందట నీ రూపే
దివాకరునికి… చల్లబడ్డాడు.

అని నువ్వంటే.. నవ్వాను పెద్దగా
ఈ క్షణాన్నే నిన్ను చేరాలని రెక్కలు కట్టుకుని
మొదలెట్టాను నా పయనముని
ఆటలాడాను నా దారిలో
పువ్వులతో పిల్ల తెమ్మెరలతో నీ కథలే చెబుతూ…

మంచి మాణిక్యాలు - కాళోజి

విజయవంతమైన మనిషి ఇలా ఉంటాడు.

జీవితంలో విజయం సాధించాలని అందరూ కోరుకుంటారు. అలా విజయం సాధించడానికి ” ఒక విజయవంతమైన మనిషి” ఎలా ఉంటాడో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ 18 సూత్రాలలో మీలో ఎన్ని ఉన్నాయో, ఎంతగా ఉన్నాయో, బేరీజు వేసుకోండి. తక్కువగా ఉన్నవాటిని బలోపేతం చేసుకోండి. ఇంతవరకూ లేనివాటిని సమకూర్చుకోండి.
1. ఏ పనినైనా కష్టపడి కాదు, ఇష్టపడి చేస్తాడు.
2. తన బలాలు, బలహీనతలను సరిగా అంచనా వేసుకుని లక్ష్యాన్ని నిర్ణయించుకుంటాడు.
3. ఆత్మన్యూనతను తొలగించుకుని, ఆత్మవిశ్వాసాన్ని అలవర్చుకుంటాడు.
4. ప్రతి విషయంలోనూ ఆశావాద దృక్పథంతోనే ఉంటాడు.
5. తోటి వారందరితోనూ సఖ్యతగా ఉంటాడు.
6. ఆర్థికంగా ఎదగాలంటే, సమయాన్ని సరిగా వినియోగించుకుంటాడు. పొదుపును పాటిస్తాడు.
7. ఏ పని మొదలుపెట్టినా మధ్యలో ఆగడు. అనుకున్న గమ్యం చేరేవరకూ ఎన్నో అడ్డంకులు, నిరుత్సాహ పరచేవారూ వచ్చినా, ధైర్యంగా ముందుకు దూసుకుపోతాడు.
8. సమస్యలొస్తే నిరుత్సాహపడక, పరిష్కారాలవైపు ఆలోచనలు చేస్తాడు.
9. అపజయానికి కారణాలను కనుగొటాడు. గుణపాఠాలు నేర్చుకుంటాడు.
10. గత అనుభవాలలోని మేలైన విషయాలన్నింటినీ గ్రహించడానికి ప్రయత్నిస్తాడు. అవసరమైన కార్యాచరణప్రణాళికలను రూపొందించుకుంటాడు. తరచూ సమీక్షించుకుంటూ ఉంటాడు.
11. సాధించ తలపెట్టిన ఆశయాన్ని అంచెలంచెలుగా విభజించి ప్రతిదశను, ఏ కాలవ్యవధిలో సాధించాలో నిర్ణయించుకుంటాడు.
12. సత్యాన్ని, సన్మార్గాన్ని, విలువలను ప్రాణాలకంటే అధికంగా ప్రేమిస్తాడు.
13. నష్టం కలిగే భయంతోనో, లాభం పొందాలనే ప్రలోభంతోనే చెడును ఆశ్రయించడు.
14. తనకు అప్పజెప్పిన పనిలో ఏమాత్రం అలసత్వాన్ని చూపడు. ద్రోహం తలపెట్టడు.
15. ఇచ్చిన మాటను ఎన్నిపాట్లు పడైనా నిలబెట్టుకుంటాడు.
16. అన్ని వ్యవహారాల్లో నిలకడగా, నిజాయితీగా ప్రవర్తిస్తాడు.
17. మంచి ఆలోచనలను, మంచి మాటలను, మంచి పుస్తకాలను, మంచి స్నేహితులను, మంచి అలవాట్లను… మంచిని వదలకుండా ఉంటాడు.
18. విజయం సాధించిన తరువాత గర్వాన్ని, అహంకారాన్ని దరిచేరనీయకుండానే మరో ఉన్నత లక్ష్యాన్ని ఎంచుకుంటాడు.


21. గెలిచిన వాడికి గతం ఉంటుంది, ఓడినవాడికి భవిష్యత్తు ఉంటుంది!
22. నీలోని ప్రతిభను, తెలివి తేటలను, నైపుణ్యాలను, శక్తిసామర్థ్యాలను, మరింత గొప్పగా, మరింత మెరుగ్గా, మరింత సమర్థవంతంగా వినియోగించుకోవడానికి నీకు లభించే సువర్ణ అవకాశమే “ఓటమి”.
23. ఆరాటం ముందు పోరాటం ఎంత? సంకల్పం ముందు వైకల్యం ఎంత? దృఢచిత్తం ముందు దురదృష్టం ఎంత? ఎదురీత ముందు విధిరాత ఎంత?
24. గెలుపుకోసం అడ్డదారులు వద్దు. మీ శక్తిని పూర్తిగా వినియోగిస్తే గెలుపు తథ్యం.
25. మీకు సంతోషాన్ని కలిగించేది మీరు ఉన్న స్థానం కాదు. మీ స్వభావం.
26. నువ్వు నిరుపేదవని అనుకోవద్దు. శక్తినిచ్చేది ధనం కాదు. శక్తినిచ్చేది నీ మంచితనం, నీ పవిత్రత, నీ దృఢచిత్తం, నీ కర్యాచరణ.
27. ప్రతిపనిని సులభంగా ఎలా చేయాలో తెలుసుకోవాలి. కానీ ఏ పనిని చులకన చేసి చూడొద్దు.
28. ఎదురుచూస్తూ కూర్చునే వారికన్నా, ముందడుగు వేసేవారికే సర్వం సిద్ధిస్తుంది.
29. తెలివైనవాడు ఒక శాతం స్ఫూర్తితోను, తొంభైతొమ్మిది శాతం కష్టపడి కలల్ని సాకారం చేసుకుంటాడు.
30. విద్యతో వినయం, వినయంతో వ్యక్తిత్వం, వ్యక్తిత్వంతో ధనం, ధనంతో ధర్మం, ధర్మంతో సుఖం వరుసగా లభిస్తాయి.
31. నీ శక్తి సామర్థ్యాలను పెంపు చేసుకోవడానికి నీ సమయాన్ని వినియోగించు.అప్పుడు ఇతరులను విమర్శించే తీరిక నీకు ఉండదు.
32. సత్యాన్ని మించిన ధర్మంలేదు. పరోపకారాన్ని మించిన దైవప్రార్థనలేదు.
33. వినయంతో ప్రారంభించి, సహనంతో కొనసాగిస్తేనే మహాకార్యాలు సాధ్యమవుతాయి.
34. బుద్ధిమంతులు అటు పుస్తకాన్ని, ఇటు జీవితాన్ని కలిపి చదువుతారు.
35. అభిరుచిని బట్టే ప్రవర్తన ఉంటుంది. ఆ ప్రవర్తనే మన విధిని నిర్దేశిస్తుంది.
36. అవసరాలను, పరిస్థితులను గమనిస్తూ జీవించేవారు క్లిష్టసమయాల్లో వారిని వారు కాపాడుకోగలుగుతారు.
37. ప్రతిఫలాన్ని ఆశించకుండా మంచిపనికి చేతనైనంత సహాయపడేవారు గొప్పవారు.
38. నిన్నటి చేదు రోజే నీ విజయ పరంపరలో స్ఫూర్తి అవ్వాలి. నేటి నిరంతర కృషే రేపటి బంగారుభవిష్యత్తుకు నిచ్చెన అవుతుంది.
39. నీవు తప్పుదారిలో నడవకుండా, హెచ్చరించేవాడే నిజమైన స్నేహితుడు.
40. క్రమశిక్షణగల వారినే విజయం ప్రేమిస్తుంది. వరిస్తుంది.
41. ఏది ఉంచుకోవాలో, మరి ఏది పెంచుకోవాలో, ఏది వదిలించుకోవాలో తెలుసుకోగలగడమే విజ్ఞత.
42. చెడును ఎత్తిచూపడం కాదు. దాని స్థానంలో మంచిని ప్రతిష్టించడమే నిజమైన సంస్కరణ.
43. నువ్వు ఎవరినైనా ప్రేమించావనుకో… వాళ్ళు మానాన వారిని వదిలెయ్. అప్పుడు వాళ్ళే వెతుక్కుంటూ నీ దగ్గరకొస్తారు. ఒకవేళ రాలేదనుకో .. అప్పుడు వారు నీవారు కారనుకో.
44. ఒక్కసారి కూడా కార్యాచరణకు పూనుకోకుండా లక్షసార్లు కేవలం ఆలోచించి ఊరికుండిపోతే ప్రయోజనం ఉండదు.
45. ఏకాగ్రత, ప్రతి నిమిషం కొత్తగా ఆలోచించటం, జ్ఞానంతో ఉండటం ఇలాంటివన్నీ సృజనాత్మకతలో భాగంగా ఉంటాయి.
46. సంతోషమంటే ఆరోగ్యంగా ఉండటం, చేదు జ్ఞాపకాలను మరచిపోవటమే.
47. మనకు తెలిసిన మంచి విషయాలను ఆసక్తి గలవారికి తెలియచెప్పటమే మీ జ్ఞానానికి పరమార్థం.
48. చేయబోయే పని గురించి తెలుసుకోవడమే వివేకం. ఎలా చేయాలో తెలుసుకోవడమే నైపుణ్యం. పూర్తి చేయడమే సామర్థ్యం.
49. అపజయం అనేది ఓడిపోయిన విషయాన్ని మరోసారి మరింత తెలివిగా ఆరంభించడానికి ఓ అరుదైన అవకాశంగా భావించాలి.
50. ఒకరికి ఉపకారం చేస్తూ, అందువల్ల తమకే లాభించినట్టు వ్యవహరించడం మంచివారి లక్షణం.
51. అభినందించటమే తప్ప, అసూయపడకుండా ఉండటం మంచి లక్షణం.
52. ఒక చిన్నదీపం ప్రపంచానికి ఇవ్వగలిగినంత వెలుగుకన్నా, ఒక మంచిపని ఈ ప్రపంచానికి ఎక్కువ మేలు చేస్తుంది.
53. మార్పునకు సిద్ధంగా ఉండండి. అపుడే కొత్త ప్రపంచాన్ని చూడగలుగుతారు.
54. ఇరవై ఏళ్ళప్పుడు సాహసం, ముప్పైలలో శక్తి, నలభైలలో సంపద, యాభైలలో వివేకం లేనివారికి ఎప్పటికీ ఉండవు.
55. క్షణం తీరిక లేకుండా, మంచి పనులలో నిమగ్నమై ఉండేవాడు, నిత్యం సంతోషంగా ఉంటాడు.
56. ఈ ప్రపంచంలో భయపడే మనస్తత్వం గలవారికి ఎప్పుడూ ప్రమాదాలు పైబడటానికి సిద్ధంగా ఉంటాయి.
57. పెద్ద కార్యాలను అసంపూర్ణంగా వదిలివేయడం కంటే, చిన్న పనులైనా సంపూర్ణంగా చేయగలగడం ఉత్తమం.
58. బంగారాన్ని ఏం చేసినా దాని విలువ మారదు… అలాగే ఎన్ని కష్టాలు ఎదురైనా ఉత్తముడి గుణం మారదు.
59. అసాధ్యమైన దానినే లక్ష్యంగా చేసుకోవాలి. అలాంటి లక్ష్యాన్ని సాధించగలిగినదే జీవితం.
60. కేవలం ప్రయత్నం ద్వారానే విజయం రాదు. కానీ, దానివల్ల మనిషి అనుభవం, విలువ పెరుగుతుంది.
61. ఆశావాదంతో గడపటమే అభివృద్ధికి మూలాధారం.
62. ఇతరుల కష్టాలను తమ కష్టాలుగా భావించే మనస్తత్వమే మంచితనాన్ని పెంచుతుంది.
63. ఈ రోజంతా మంచే జరుగుతుందని మిమ్మల్ని మీరు దీవించుకోండి.
64. మనిషి మనసులో వినయం ఎంత ఎదిగితే, ఆ మనిషి జీవితంలో అంతగా ఎదగగలుగుతాడు.
65. ఉత్తేజం కలిగించేవే ఉత్తమమైన పుస్తకాలు.
66. ప్రపంచంలో, మనం చేయలేమని అందరూ అనుకునే పనిని, మనం చేసి చూపించడంలోనే, అన్నిటినీ మించిన ఆనందం లభిస్తుంది.
67. పరులు మీకు చేసిన అపకారాన్ని పూర్తిగా మరచిపోండి. ఇంతకన్నాముఖ్యం మీరు పరులకు అందించిన ఉపకారాన్ని మర్చిపోవడం.
68. అందరిలో మంచి చూడటం నేర్చుకుంటే మనలో మంచి మరింత పెరుగుతుంది.
69. మనం ఎలా ఉండాలో ఏకాంతం నేర్పుతుంది. మనం ఎలా ఉన్నామో సమాజం చెబుతుంది.
70. మంచిపని చేసేవాడు ఎప్పుడూ నష్టపోడు. అతనికి ఎల్లప్పుడూ మంచే జరుగుతుంది.
71. ఇతరులను అదుపు చేయడం గొప్ప విషయమే. కానీ తనను తాను అదుపు చేసుకోవడం అంతకన్నా కష్టమైన గొప్ప విషయం.
72. ఏ మనిషైనా చేయదగ్గ ఏమాత్రం ఖర్చులేని పని ఏమిటంటే ఎదుటి వ్యక్తిని చిరునవ్వుతో ఆప్యాయంగా పలుకరించడం.
73. మనం అనుకున్నట్లుగా జీవితం ఉండాలంటే మన ఆలోచనలూ, కార్యాచరణలు అలాగే ఉండాలి.
74. బక్కెట్ల కొద్దీ సలహాలివ్వడం కంటే, చెంచాడు ఆచరించడం మేలు.
75. జరిగిన దానికోసం బాధ, జరగనున్న దానికోసం భయం లేకుండా, జరుగుతున్న పనిపై ధ్యాస ఉన్నవాడే ఉత్తముడు.
76. చరిత్రను రాసింది విజేతలే.
77. రాత్రిపూట సూర్యుడు కనిపించలేదని కన్నీరు కారుస్తుంటే ఆఖరికి నక్షత్రాలు కూడా కనిపించకుండా పోతాయి.
78. తన కోపాన్ని అదుపులో పెట్టుకోలేనివాడు తన మనసును, శరీరాన్ని కూడా అదుపు చేయలేడు.
79. మనుషులు ఇతరుల బోధన ద్వారా కంటే తమ అనుభవాల ద్వారానే ఎక్కువ నేర్చుకుంటారు.
80. చాలామంది డబ్బు ఎలా పనిచేస్తుందో తెలుసుకోవడానికి ప్రయత్నించరు. అందుకే వారు జీవితాంతం దాని కోసమే పని చేస్తుంటారు.
81. చెడుగుణాలను వదిలివేయడానికి మంచిగుణాలను అభ్యసించు.
82. నిజాయితీగా పనిచేసే వారికి కాలం అనుకూలపడి తీరుతుంది.
83. ఓర్పు,శ్రమ,సహనం, ఆత్మవిశ్వాసం, ధైర్యం, మనోబలం ఇవే విజయసాధనకి ఆయుథాలు.
84. మనం బతకడం కాదు. జీవించడం నేర్చుకోవాలి. మనవల్ల మరో పదిమందికి మేలు జరగాలి.
85. విజ్ఞానాభిలాషులు ఎల్లప్పుడూ యువకులుగానే ఉంటారు. అది కోల్పోయిన వారు వృద్ధులతో సమానం.
86. ఎక్కువ మంది విమర్శిస్తారు. కొద్ది మంది ప్రశంసిస్తారు. బహు కొద్ది మంది ప్రోత్సహిస్తారు.
87. నిన్నటి పొరపాట్లతోను, రేపటి గురించి భయంతోనో ఈ రోజును వృథా చేయకు.
88. అయ్యింది, అవుతున్నది, అవ్వబోయేది కూడా నీ మంచికే.
89. నిరాడంబరంగా జీవించడం, ఉన్నతంగా ఆలోచించడం ప్రతి ఒక్కరూ చేయవలసిన పనులు.
90. అభివృద్ధి అనేది భవిష్యత్తుకు కొత్త అవకాశాలు కల్పించడమే కాదు, కొత్త నిబంధనలు కూడా పెడుతుంది.
91. నింద నిజమైతే తప్పక దిద్దుకో, అబద్ధమైతే నవ్వేసి ఊరుకో.
92. వారసత్వంగా సంక్రమించిన దానికంటే, స్వయంకృషి ద్వారా సాధించుకొన్నదే మిన్న.
93. తల్లిదండ్రులు పిల్లలకు మంచి సలహాలు, మంచి మార్గాన్ని మాత్రమే సూచించగలరు. కానీ వ్యక్తిత్వాన్ని మలచుకోవడం మాత్రం వారి చేతుల్లోనే ఉంటుంది.
94. గెలవాలన్న తపన తగ్గు ముఖంపడితే ఓటమికి దగ్గరైనట్లే.
95. దేని ద్వారా వ్యక్తిత్వం ఏర్పడుతుందో, ఆత్మవిశ్వాసం పెంపొందుతుందో, బుద్ధి వికసిస్తుందో అదే మంచి విద్య.
96. సుఖశాంతులనేవి ఒకరికి నీవుఇచ్చే వాటిపై ఆధారపడి ఉంటాయి. అంతేకాని వారి నుండి నీవు పుచ్చుకునే వాటిపై కాదు. 
97. అందం తొందరగా కంటికి పాతబడి పోతుంది. సౌశీల్యానికి మాత్రమే ఎప్పుడూ నశించని ఆకర్షణ ఉంటుంది.
98. ప్రతి వ్యక్తీ గొప్పవాడయ్యేందుకు ప్రయత్నించవచ్చు. కానీ అది ఇతరుల పతనాన్ని కోరుకోవడంవల్ల కాకూడదు.
99. బాధ్యతారహితమైన మాటలు…ఇతరులకు మనపై ఉన్న ప్రేమను తగ్గిస్తాయి.
100. సోమరితనం అన్నిటికీ కష్టాలు కలిగిస్తే, శ్రమ అన్నిటినీ తేలిక చేస్తుంది.
101. భగవంతుణ్ణి మీరు ఎంత కోరినా మీకు ఇవ్వలేదంటే అది మీకు దక్కక పోవటమే మంచిదని అర్ధం.
102. ఒక వ్యక్తి జీవితంలోని విజయము, అతడి సంకల్ప శక్తి, ఒకే నిష్పత్తిలో ఉంటాయి.
103. నిత్యమూ శ్రమించేవాడికి కొద్దిపాటి విశ్రాంతి అయినా సరిపోతుంది.
104. సర్దుబాటు మనస్తత్వం ఉన్నవాడే బతకడంలో బహునేర్పరి.
105. మనకు తెలిసిందేదో, తెలియనిదేదో తెలుసుకోవడమే నిజమైన విజ్ఞానం.
106. సంతోషంగా ఉండే వారితో స్నేహం చేయాలి.
107. ఇతరుల్ని అర్థం చేసుకున్నవాడు విజ్ఞాని. తనని తాను తెలుసుకున్నవాడే వివేకి.
108. స్వేచ్ఛగా జీవించే వ్యక్తి తన చుట్టూ గొప్ప వ్యక్తులను సృష్టించుకుంటాడు.
109. పరిస్థితులను శాంతియుతంగా ఎదుర్కోవడంవల్ల మనోబలం పెరుగుతుంది.
110. స్వలాభం కోసం చేసే పనులైనా, ఇతరులకు ఉపయోగపడే విధంగా ఉండాలి.
111. ప్రకృతి, కాలం, ధైర్యం… ఈ మూడు ఉత్తమమైన గొప్ప వైద్యులు.
112. మనిషి జీవితానికి నిజాయితీ పునాది. మానవత్వంలో ఒక భాగం నిజాయితీ.
113. నిజాయితీగా కష్టపడి సంపాదించిన ధనం సంతోషం కలిగిస్తుంది.
114. దూరంగా ఉన్న “గెలుపు” ను చూస్తూ ప్రయాణం చేస్తాడు సామాన్యుడు. “గెలుపు” తోనే ప్రయాణం చేస్తాడు మేథావి!
115. క్షమించగలిగే మనస్తత్వం ఉన్నప్పుడు ప్రతిదానినీ అర్థం చేసుకోవడం తేలికవుతుంది.
116. పుస్తకాలు పుప్పొడి రేణువులవంటివి. కొత్త భావాలకు అవి బీజ కణాలు అవుతాయి.
117. నీ జీవితాన్ని ఎంత జాగ్రత్తగా నిర్మించుకుందామనుకున్నా, అనుకోని సంఘటనలు దానిని తారుమారు చేయవచ్చు.
118. శాంతి అనేది మానసికం, ఆధ్యాత్మికం. ఇది మీ జీవితాన్ని మాత్రమే కాకుండా ప్రపంచం మొత్తాన్ని మార్చగలుగుతుంది.
119. ప్రపంచమంతా నిద్రపోయిన తరువాత కూడా గెలిచేవాళ్ళు గమ్యంవైపు నడుస్తూనే ఉంటారు. చీకట్లో దారి తెలియక అప్పుడప్పుడు పడిపోవచ్చేమో కూడా, అయితే వారికి తెలుసు. మొగ్గలు చీకట్లోనే పువ్వులుగా వికసించటం ప్రారంభిస్తాయని.
120. జీవితంలో ప్రతీ పనికి ఒక మంచి ముగింపు ఉంటుంది. అది మంచిది కాకపోతే అది ముగింపు అనుకోవద్దు, అప్పుడే మొదలైందని అర్థం.
121. భయపడనివారు కోపిష్టులు కాదు, ప్రశాంతత తెలిసినవారు.
122. మనలోని శక్తియుక్తుల్ని మనం సమర్థంగా వెలికి తీసుకోగలిగితే, ఎంతటి జటిలమైన అవరోధమైనా మన అభివృద్ధిని ఆపలేదు.
123. ఏదో ఒకటి కోరుకోవడం తప్పుకాదు. ఏ కోరికలు లేకుండా ఉండటమే తప్పు.
124. ఒక పని, ఒక నిద్ర, కొంచెం ప్రేమ. అంతే అదే జీవితం.
125. జీవితంలో అనుకున్నది సాధించగలిగినా, ఆనందం నీ వెంట లేకుంటే అంతా వ్యర్థమైనట్లే.
126. ప్రతి ఒక్కరిలో మంచిని చూడగలగడం, ప్రతి ఒక్కరితో మంచిగా వ్యవహరించటమే నిజమైన ఆధ్యాత్మికత అంటే.
127. మనం ఎలాంటి మార్పునైతే అశిస్తున్నామో, అలాంటి మార్పు ముందు మనలోనే రావాలి.
128. మంచి హృదయం, మంచి ఆలోచన ఈ రెండూ అద్భుతమైన జోడి.
129. మంచివాళ్లతో స్నేహం చెయ్యి, నిన్నూ వాళ్ళలాంటివారి గానే పరిగణిస్తారు.
130. ఎదుటివారి ఉన్నతిలోనే ఆనందం చూడగలిగే సంస్కారవంతులు దేశం అంతటా స్వాతి ముత్యాలై వెలుగుతూ ఉంటారు.
131. ప్రపంచంలో చాలామంది తమకేమి కావాలో అడగలేరు. ఫలితంగా దేనినీ సాధించలేరు.
132. జీవితంలోని ఒడిదుడుకులకు కారణాలు మనసుకు తెలుస్తూనే ఉంటాయి. ధైర్యాంగా ఒక నిర్ణయం తీసుకో గలిగితే మన జీవితం చక్కబడుతుంది.
133. పనిని ప్రేమించే గుణమే ఒక అత్యద్భుతమైన శక్తిని ప్రసాదిస్తుంది.
134. బాధ అనే అనుభవం నుండి మీరు బలమైన వ్యక్తిగా రూపుదిద్దుకుంటారు.
135. గొప్ప కార్యాలను సాధించాలంటే బలమైన అవరోధాలను అధిగమించాలి.
136. అతిగా ఆలోచించి ఊరికుండిపోవటం కన్నా, మితంగానైనా ఆచరించడం, హితంగానైనా జీవించడంలోనే విజయాలు దాగి ఉన్నాయి.
137. నిజాయితీగల ధైర్యవంతులకు క్షమాగుణం ఉంటుంది.
138. నీవు కావాలనుకున్నది సాధించుకోవాలనుకుంటే నీలో ఉన్న శక్తిని నీవు విశ్వసించాలి.
139. ప్రపంచంలో పైకి వచ్చిన ప్రతివారూ, కలలుగని ఆ కలలని నిజం చేసుకోవడానికి శ్రమించినవారే.
140. ఇవ్వగలిగిన దానికంటె ఎక్కువ ఇవ్వడం ఔదార్యం. అవసరమైన దానికంటె తక్కువ తీసుకోవడం గౌరవం.
141. ఇతరులను మార్చాలని అందరూ అనుకుంటారు. కానీ వారిని వారు సంస్కరించుకోవటం మాత్రం చేయరు.
142. ప్రతిరోజు మనిషికి ఓ కొత్త అవకాశం. గతాన్నిదిద్దు కోవడానికి, వర్తమానాన్ని మెరుగుపరచుకోవడానికి.
143. జీవితంలో కావలసింది నిజమైన తపన. ఆందోళన కాదు.
144. మంచి నడవడిక అనేది ఎవరో ఇచ్చేకానుక కాదు, ఎవరికి వారు అనుసరించి సాధించవలసిన విజయం.
145. తన ఆశలకు తన శక్తిసామర్థ్యాలకు మధ్యనున్న అగాధాన్ని అర్థం చేసుకున్నవాడు సుఖపడతాడు.
146. చేదు గతాన్ని తవ్వుకునే కన్నా, తీపి భవిష్యత్తుకు ప్రణాళిక వెయ్యి.
147. మోసాలన్నిటిలోకి ఆత్మవంచనను మించిన మోసం మరొకటి లేదు.
148. యుక్తవయస్సులో బాధ్యతగా ఉండనివాడు, వృద్ధాప్యంలో ఇబ్బందులు పడతాడు.
149. మనలో ఆవగింజంత ఆత్మవిశ్వాసం ఉంటే చాలు, విశ్వాన్నే జయించవచ్చు.
150. ప్రతివాళ్ళు తాము చేయవలసిన తమ పనిని బాధ్యతగా చేసుకుంటూపోతే ఈ ప్రపంచం ఇంతకన్నా చాలా వేగంగా ముందుకెళ్ళకలుగుతుంది.
151. కాలాన్ని అర్థం చేసుకోగలిగిన వ్యక్తి, జీవితాన్ని అపార్థం చేసుకోలేడు.
152. ఎప్పుడూ నవ్వుతూనే ఉండగలిగితే అప్పుడు ఈ ప్రపంచంలో నీకన్నా అందమైనవారు మరొకరు ఉండరు.
153. తనకు దక్కింది మాత్రమే తనది, దక్కలేదంటే అది తనది కాదన్నమాట. దీన్ని బాగా అర్థం చేసుకుంటే మనిషికి ఆనందం లభిస్తుంది.
154. నువ్వు ఉత్సాహాంగా తిరుగుతూ ఉంటే మొత్తం దేశమే నీ నేస్తమవుతుంది. ఎప్పుడూ పడుకుని ఉంటే నీ చాపనే నిన్ను ఏవగించుకుంటుంది.
155. ఉన్నతమైన ఆలోచనలు చేయడమే గొప్పకాదు. వాటిని సాధించేవరకు కృషిని విడవని వారే గొప్పవారు.
156. కష్టంగా భావించే దాన్ని సాధించడం “నేర్పు”. అసాధ్యంగా భావించే దాన్ని సాధించడం “ప్రతిభ”.
157. తెలివితేటలు, సామర్థ్యం ఉన్నా సాధించాలన్న తపన లేకపోతే మిగిలేది వైఫల్యమే.
158. దానం చేస్తున్నాననే అహాన్ని విడిచి దానం చేయడం నేర్చుకో.
159. జ్ఞానంతో బుద్ధి శుభ్రపడుతుంది. దానంతో పవిత్రమవుతుంది. ప్రేమతో హృదయం నిర్మలమవుతుంది.
160. ఈ రోజును సద్వినియోగం చేసుకుంటే రేపటిని నవ్వుతూ అహ్హానించగలుగుతాం.
161. ఆశావహ దృక్పథం ఉన్నవారు సంపూర్ణ ఆరోగ్యంతో ఉంటారు. పరిపూర్ణ ఆరోగ్యం పొందిన వారికి అన్నీ సమకూరుతాయి.
162. ఏం చేయాలో చెప్పేది విజ్ఞానం. ఎలా చేయాలో తెలిపేది బుద్ధి కుశలత. అలా చేయగలగడం ప్రజ్ఞ.
163. గోరంత విత్తనం నుంచి పుట్టే మొక్క చక్కగా ఎదిగి గోపురమంత చెట్టవుతుంది.
164. మీరు అద్భుతమైన పనులను చేయబోతున్నారు. భయపడిన మరుక్షణం మీరు ఎందుకు పనికిరారు. ఈ ప్రపంచంలో బాధలన్నింటికీ భయమే కారణం.
165. ఇతరులను ద్వేషించటం అంటే నీ సమయాన్ని వృథా చేసుకోవడమే.
166. తప్పులు, పొరపాట్లతో ఓటమి రాదు. ఆ అనుభవాల నుంచి గుణపాఠం నేర్చుకోక పోవడంవల్ల వస్తుంది.
167. చక్కని అవకాశం చేజారిందని అదేపనిగా కుమిలిపోవద్దు. కన్నీళ్ళతో మసకబారిన కళ్ళు మరోమంచి అవకాశాన్ని గుర్తించలేవు.
168. నేటి కాలంలో నలుగురితో పాటు అన్నట్లు కాక, వారికన్నా కాస్త మెరుగ్గా ఉండటానికి ప్రయత్నించాలి.
169. ఈ రోజు నువ్వు చేస్తున్న పని, రేపటి నీ గమ్యానికి నిన్ను దూరంగానో, దగ్గరగానో తీసుకెళ్తుంది.
170. వనరులూ వసతులూ కాదు, ఎవరి విజయానికైనా! ఆలోచనా విధానమే మూలం.
171. ఏది శాశ్వతం కాదు. ఎదుగుదల బాహ్యంగానే కాదు, అంతర్ముఖంగానూ ఉండాలి.
172. “ఆలోచన నుండి ఆచరణలు. ఆచరణల నుండి అలవాట్లు. అలవాట్లనుండి మేలైన వ్యక్తిత్వం. వ్యక్తిత్వమే భవిష్యత్తుకు బంగారుబాట వేస్తుంది”.
173. ఒక మంచి పుస్తకం మనలో దాగి ఉన్న శక్తులను మేల్కొల్పడానికి దోహదపడుతుంది.
174. కరుణ కలవాడు తన శక్తి సంపదలనే కాక అవసరాన్ని బట్టి తననే ఇచ్చుకుంటాడు.
175. అపారమైన ఆలోచనలు ఎన్ని ఉన్నా వ్యర్థమే, అవి అనుసరించి అమలు పరచనప్పుడు.
176. మంచిమాటలు ఎంత ఎక్కువ చెప్పినా వాటిని గ్రహించేది అతి కొద్ది మందే.
177. తల్లిదండ్రులకు సేవ చేయటం వల్ల ఋణమైతే తీరదు కాని, కనీసం కృతజ్ఞతైనా చూపించినట్లవుతుంది.
178. కోపం మానవ సహజం. కానీ, దాన్ని ఏ సమయంలో ఉపయోగించాలో తెలుసుకోవటమే విజ్ఞత.
179. సంతోషంగా ఉన్నావంటే నీ వెంటే ప్రపంచం ఉంటుంది. దుఃఖంలో ఉన్నావంటే నువ్వు ఒంటరిగానే మిగిలిపోతావు.
180. తెలియనిది అడిగితే బయటపడే అజ్ఞానం కొద్దిసేపే. అడగకపోతే జీవితాంతం అజ్ఞానంతోనే మిగిలిపోతారు.
181. నీ బాధకు కారణం ఏదైనా కావచ్చు, ఆ కారణంగా ఇతరులకు హాని చేయవద్దు. 
182. ఎలాంటిదాని మీదైనా ద్వేషం లేనివారే ఆనందంగా జీవిస్తారు.
183. ఎవరైనా సరే తమ తెలివితేటలను మంచి పనులకు ఉపయోగిస్తే సమాజానికి మేలు జరుగుతుంది. చేసిన వాళ్ళకు గౌరవం కలుగుతుంది.
184. గెలుపు గురించి అతిగా ఆలోచించొద్దు. అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే చాలు.
185. బాధ్యతలు స్వీకరించిన వ్యక్తి మునుపటికంటే మరింత శక్తిగా, ఉన్నతంగా మారతాడు.
186. సాధారణంగా జీవించు… గొప్పగా ఆలోచించు. అదే నీ జీవితానికి విలువను తెచ్చిపెడుతుంది.
187. శారీరక దృఢత్వం కంటే మానసిక స్థిరత్వం గొప్పది. దీన్ని సాధించడంపైనే విజయం ఆధారపడి ఉంటుంది.
188. జీవితం అనే ఆటలో గెలిచామా? ఓడామా? అని కాదు. ఆట ఆడేటప్పుడు ఆనందంగా ఆడామా? లేదా? అన్నదే ముఖ్యం.
189. అపజయం జరిగినదాన్నిబట్టి ఉండదు. దాన్ని మీరెలా తీసుకుంటారన్న దాన్నిబట్టి ఉంటుంది.
190. ప్రతి ఒక్కరినీ మీరు ఎదురు చూసే తీరులోకి మార్చాలని అనుకోకండి. అంతకన్నా ఎదుటి వాళ్ళను అలాగే అంగీకరించడం నేర్చుకోండి.
191. ఎవరిపట్ల ప్రతీకారం తీర్చుకోవాలని మీరు అనుకుంటున్నారో, ఆ వ్యక్తే చాలా మౌనంగా మీ మీద ప్రతీకారం తీర్చుకుంటున్నాడు.
192. దిగులు చెందకుండా, ఉత్సాహం కలిగి ఉండటం ఐశ్వర్యానికి మూలం.
193. కష్టాలు బలహీనుడ్ని కుంగదీస్తాయి. బలవంతుడ్ని మరింత అభివృద్ధి పథంవైపు నెట్టుతాయి.
194. ఒక లక్ష్యాన్ని పెట్టుకుని దాన్ని సాధించినప్పుడు పొందేదే అసలైన ఆనందం. 
195. వాస్తవాల కంటే, ఊహల గురించే తలచుకొని మనుషులు ఎక్కువ కలత చెందుతారు.
196. మెరుగుపట్టని వజ్రం ప్రకాశించదు, కష్టాలను ఎదుర్కోని మనిషి రాణించడు.
197. దేవుడు ఇంటింటికి రాలేక తల్లిని సృష్టించాడు.
198. జీవితంలో తప్పులు అందరూ చేస్తారు. అయితే తప్పుకు బాధ్యతను అంగీకరించి సరిదిద్దుకునేవారే విజేతలుగా నిలుస్తారు.
199. నువ్వు ఎంచుకున్న దారిని విడువకుండా పయనిస్తున్నప్పుడు ప్రగతి సాధిస్తావు.
200. నిజమైన సంపదంటే ధనం కాదు. మనసు ప్రశాంతంగా ఉండటం అని అర్థం.
201. సృజనకు మూలం ఆలోచన. నీవు కోరుకున్నది దీని ద్వారానే సాధించగలవు.
202. జ్ఞానం లేక పోవటం కన్నా శ్రద్ధలేక పోవటం ఎక్కువ హానికరం.
203. ఒత్తిడిలో కూడా ధైర్యంగా ఉండటం ఉన్నతమైన విషయం.
204. తాను సరిగా ఉన్నానని సమర్థించుకోవడం కంటే, తనను తాను సరిగా ఉంచుకో గలిగేలా ఉండగలగటం సరియైన పని.
205. ధ్యానాన్ని, ఒక పనిగా చేయకు. ప్రతి పనినీ ఒక ధ్యానంగా చేయి.
206. నీ పని ఫలితాలపై కాకుండా, ముందు కర్తవ్యాన్ని నిర్వర్తించినప్పుడు జీవితం సుఖంగా సాగిపోతుంది.
207. పనుల మధ్య విశ్రాంతి అంటే, మరో పనిని చేయడమే.
208. మౌనానికి మహత్తర శక్తి ఉంది. మంచి ఆలోచనలు, నిర్ణయాలు మౌనం నుండే పుడతాయి.
209. ఏ పని చేసినా, ఎవరికోసం చేసినా, సేవా భావంతో చేయాలి.
210. అసమర్థులు వేటిని చూసి భయపడి మానేస్తారో వాటిని సమర్థులు అవకాశాలుగా మలచుకుంటారు.
211. ఒంటరిగా బతక గలిగినవాడు అందరికన్నా శక్తిమంతుడు.
212. సేవ అనేది ఒక వృత్తి కాదు, అది అంకిత భావంతో చేసే పుణ్యకార్యం.
213. ప్రపంచంలోని ఏ గొప్ప వస్తువు కూడా మంచి స్నేహితుడితో సరితూగటానికి సరిపోదు.
214. మంచివాడనిపించుకోవాలని చెడును సమర్థించే కంటే దానిని ఎదుర్కోవడమే ఉత్తమం.
215. పుస్తకాలు చదవాలనే అభిరుచి ఉన్న మనిషి ఎక్కడున్నా సుఖ సంతోషాలతో ఉండగలుగుతాడు.
216. వైఫల్యం నిరాశకు కారణం కాకూడదు. కొత్త ప్రేరణకు పునాది కావాలి.
217. పుస్తకాల కన్నా ప్రకృతి ఎక్కువ విషయాలను తెలియజేస్తుంది.
218. బాధ్యత తెలిసిన వ్యక్తికి పనే ప్రపంచం. బాధ్యతారహితులకు సోమరులే ఆదర్శం.
219. పూల పరిమళం గాలివాటుకే వెళుతుంది. కానీ, మనిషి మంచితనం ప్రతి దిక్కుకూ ప్రసరిస్తుంది.
220. అనుకున్నది సాధించటానికి రెండో ఆలోచన లేకుండా లక్ష్యంపైనే మనసును కేంద్రీకరించాలి.
221. నువ్వు కోరుకున్నవన్నీ దొరకనప్పుడు, నీకు అవసరంలేని వాటిని గురించి అలోచించకు.
222. ప్రతి అడుగును లక్ష్యంగా మార్చడం, ప్రతి లక్ష్యాన్ని అడుగుగా మార్చడం ద్వారా విజయం సాధించవచ్చు.
223. పరాయి వాళ్ళ దివ్య భవనాల్లో నివసించడం కంటే, సొంత గుడిసెలో ఉండటం మేలు.
224. గతాన్ని విసర్జించండి. మిమ్మల్ని మీరు ప్రేమించండి. ప్రతీ క్షణాన్ని పూర్తిగా అనుభవించండి.
225. మనసులో ఎటువంటి కల్మషం లేకుండా మనిషి మనీషిగా జీవించడమే మహనీయత.
226. ఇచ్చింది మరచిపోవడం, పుచ్చుకున్నది జ్ఞాపకముంచు కోవడమే స్నేహం.
227. సత్పురుషుల జ్ఞాన సంపద కేవలం సజ్జనులకు మాత్రమే ఉపయోగపడుతుంది.
228. పరోపకార గుణం కలిగినవారు ఆశలను వదిలివేస్తారు. ఓర్పును కలిగియుంటారు. గర్వమును విడుస్తారు.
229. పరిస్థితి అనుకూలించినా, అనుకూలించకపోయినా సంతోషంగా ఉండేవాడే నిత్య సంతోషి.
230. నాకు చెప్పులు కరువయ్యాయని ఏడ్చాను. కాళ్ళులేని వ్యక్తిని చూసేవరకూ.
231. ఆపదలో ఉన్నవారికి సేవ, సహాయం చేసినవారే ఎక్కువ ఆనందంగా ఉంటారు.
232. బాల్యంలో ప్రేమించే తల్లిదండ్రులను కలిగి ఉండటం ఆ తర్వాత పుస్తకాలను చదువుతూ ఉండేవారే నిజమైన భాగ్యవంతులు.
233. అందరినీ ప్రేమించు, కొందరినే నమ్ము, ఎవరికీ హాని చేయకు.
234. వందమందికి నువ్వు సహాయం చేయలేకపోవచ్చు, కనీసం ఒక్కరికైనా సహాయపడు.
235. రాపిడి లేనిదే రత్నం ప్రకాశించదు. అలాగే కష్టాలు తట్టుకోలేని మనిషి ఏనాటికీ పరిపూర్ణత సాధించలేడు.
236. గతాన్ని మరచిపో, ప్రస్తుతం నీ ముందున్నకర్తవ్యాన్ని గురించే ఆలోచించు.
237. కలసిరావటం ఆరంభం, కలసి ఉండాలని నిశ్చయించుకోవడం ప్రగతికి చిహ్నం, కలసి పని చేయడం విజయానికి సోపానం.
238. పనిలోనే ఆనందించేవానికి ఫలితంపై ఆలోచన ఉండదు.
239. హడావడి వల్ల ఎలాంటి లాభం ఉండదు. ఇది ఉన్నవారు ఎప్పటికైనా నష్టపోతారు.
240. ప్రతీ వైఫల్యం మనల్ని విజయానికి మరింత చేరువ చేస్తుంది.
241. ఒకే పుస్తకాన్ని ఎందరో చదువుతారు. కాని కొందరే దానిలోని మంచివల్ల ప్రభావితమవుతారు.
242. విజ్ఞానాన్ని ఆచరణలో పెట్టగలిగిన పరిజ్ఞానం కలిగినవాడే, నిజమైన నాయకుడు.
243. ధైర్యం ఉంటే దేనినైనా సాధించవచ్చు. అయితే ఆ ధైర్యానికి ఆత్మవిశ్వాసం తోడవ్వాలి.
244. ఇతరులకు ఎంత సహాయం చేసావో లెక్కించక పోవడమే నీలో ఉన్న గొప్ప లక్షణం.
245. ఈ ప్రపంచంలో మీరొక్కరే మీలా ఉన్నారు. ఆత్మవిశ్వాసానికి తొలిమెట్టు ఇదే.
246. ఇతరులు విమర్శిస్తున్నప్పుడు నువ్వు అలోచించు.. ఇతరులు సంశయిస్తున్నప్పుడు నువ్వు నిర్ణయం తీసుకో… ఇతరులు వాయిదా వేస్తున్నప్పుడు నువ్వు బాగా పని చెయ్యి.
247. ప్రతి అవకాశంలోనూ కొన్ని అడ్డంకులుంటాయి. ప్రతి అడ్డంకి వెనుకా కొన్ని అవకాశాలుంటాయి. మనం దేన్ని చూస్తామన్నదే ముఖ్యం.
248. జీవితంలో మనం ఎంత సంపాదించాం, ఎంత పోగేశాం అన్నది కాదు. మన ద్వారా పదిమందికి ఎంత పంచాం అన్నది ముఖ్యం. అది మనం ఎటువంటి బతుకు బతికామో, బతుకుతున్నామో నిర్దారించేదీ, నిగ్గు తేల్చేది!
249. తాము అనుసరించలేని మంచితనాన్ని చూసి ప్రతి వ్యక్తి భయపడతాడు.
250. మీరు మరొకరి జీవితాన్ని బాగుపరచాలని ప్రయత్నిస్తే చాలు, మీ జీవితమూ బాగుపడుతుంది.
251. మిత్రుడు ఆనందంగా ఉన్నప్పుడు ఆహ్హానిస్తే వెళ్ళాలి. కష్టాలలో ఉన్నప్పుడు పిలవకున్నా వెళ్ళాలి.
252. జీవితంలో మీకు సంభవించిన విషయాలను గురించి కాకుండా, మీరు చేయగలిగిన విషయాల గురించే ఎక్కువగా ఆలోచించండి.
253. అన్వేషణ ఆపకండి. అన్వేషించిన కొద్దీ కొత్త విషయాలు తెలుస్తూనే ఉంటాయి.
254. ఇతరుల కష్టాలలో పాలు పంచుకునే వారికి నిజమైన మిత్రులు లభిస్తారు.
255. ప్రేమించడమంటే హృదయంతో ప్రశంసించడం. ప్రశంసించడమంటే మనసుతో ప్రేమించడం.
256. నిన్ను నీవు చేతకానివాడిగా అనుకుంటే, ఇతరుల ముందు అలాగే అయిపోతావు.
257. సోమరితనాన్ని, వృథా కాలక్షేపాన్ని విడిచి ఏకాగ్రతతో లక్ష్య సాధనకు ఉపక్రమించాలి.
258. సేవా దృక్పథంతో చేసే త్యాగంలోనే మనిషికి ఆనందం, స్వేచ్ఛ లభిస్తాయి.
259. జీవితం నదిలాంటిది. అందులో సుడిగుండాలే కాదు, తెలియని మొసళ్ళు ఉంటాయి.
260. ఉన్నది పొదుపుగా వాడుకోవడం కూడా ఆదాయం పెంచుకునే మార్గం.
261. వ్యక్తిలో జ్ఞానం లేకున్నా నైతికత ఉంటే అదే అతని గొప్పతనాన్ని చాటుతుంది.
262. మంచి రోజులు ఏర్పాటై ఉండవు. మనం చేసే పనులను బట్టే అవి రూపుదిద్దుకుంటాయి.
263. ఏ పనీ అల్పంకాదు. ఇష్టమైన పని లభిస్తే పరమ మూర్ఖుడు సైతం చెయ్యగలడు. అన్ని పనులూ తనకిష్టంగా మలచుకునేవాడే తెలివైనవాడు.
264. ఎవరో వచ్చి నిన్ను నడిపిస్తారని ఎదురు చూడకు. నువ్వు చేయవలసింది ఒంటరిగానే చెయ్యి.
265. ప్రేమతో నిండిన హృదయం నిజమైన జ్ఞానాన్ని అందిస్తుంది.
266. నలుగురికి మేలు చేయాలి, నేను బాగుండాలి అనుకునే వ్యక్తి మనసు స్వచ్ఛమైన గులాబీని పోలి ఉంటుంది.
267. గొప్ప ప్రయత్నాలు, గొప్ప ఆలోచనలన్నీ హేళనతోటే మొదలవుతాయి.
268. శారీరక సౌందర్యం ఎంత ఉన్నా హృదయ సౌందర్యం లేకపోతే అదంతా దండగే.
269. చిన్న వయసులో సాధించే విజయం అద్భుతమైన ఆనందాన్నిస్తుంది.
270. ఏకాగ్రత సాధించాలంటే మన మనస్సులో మంచి ఆలోచనలు చేయాలి.
271. మన లక్ష్యాలు ఎలాంటివై ఉండాలంటే, ఇతరులకు సేవ చేయడం, ఈ దేశాన్ని మరింకింత ఆనందమయంగా చేయటానికి మన ప్రయత్నం మనం చేయడం.
272. ఆత్మవిశ్వాసం విజయానికి కీలకం. ఆత్మవిశ్వాసం నైపుణ్యాన్ని, సామర్థ్యాన్ని ఒకేసారి వెలికి తీస్తుంది.
273. మనల్ని మనమే ప్రేమించుకోలేకపోతే, మనల్ని ఎవరు ప్రేమిస్తారు.
274. భవిష్యత్తు గురించి ఆందోళన చెందుతూ వర్తమానాన్ని మరచిపోవద్దు.
275. మనిషి జీవితంలోని ప్రతీ సంఘటనకూ ఒక ప్రయోజనం ఉండే ఉంటుంది. అలాగే ప్రతి అపజయంలోనూ నేర్చుకోవలసిన ఒక గుణపాఠం ఉండి ఉంటుంది.
276. నీవు అంకితభావంతో పనిచేస్తూ వృత్తి ప్రావీణ్యాన్ని సంపాదించు.
277. జరిగిపోయిన విషయాలు గురించి బాధపడకు. ఆ అనుభవాల నుండి నేర్చుకోవలసిన దానిని గమనించు.
278. మనం ఓ లక్ష్యం కోసం ప్రయత్నాలు చేయడం ప్రారంభించే దాకా మనలో అంతర్లీనంగా దాగివున్న శక్తి సామర్థ్యాల గురించి మనకే తెలియదు.
279. మనకు తెలిసిన విషయాలలో మంచి వాటిని వీలున్నంత ఎక్కువ మందికి పంచిపెట్టాలి. కోరుకుంటున్నవారికి పంచే ప్రయత్నం చేయండి.
280. జ్ఞానం కలిగిన ధనికులు, దానధర్మాలు చేస్తూ, నిజమైన ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటారు.
281. మన జీవితంలోని ప్రతీ క్షణాన్ని మరపురాని క్షణంగా చేసుకోవడానికి ప్రయత్నిద్దాం.
282. ఉన్నదానికంటే తక్కువగానే కనిపించు. అలాగే తెలిసిన దానికంటే తక్కువగానే మాట్లాడు.
283. మనం సుఖంగా జీవించడానికి, ఆనందంతో జీవించడానికి మధ్య చాలా తేడా ఉందని గ్రహించాలి.
284. మనసు మారిపోకముందే తలచిన మంచి పనులను చేసెయ్యండి.
285. మనిషి విజయం సాధించడానికి క్రమశిక్షణ, ఆత్మనిగ్రహం ఉండాలి.
286. తాను సంపాదించిన ధనమే ఉత్తమం. తండ్రి నుంచి సంక్రమించిన ధనం మధ్యమం. ఇతరుల ధనానికి ఆశపడటం అధమం.
287. మనపై మనకు శ్రద్ధ, భక్తి, విశ్వాసాలు లేకపోతే, మనం ఇతరులకేమి మంచి చెప్పగలం, ఏమి మంచి చేయగలం.
288. వ్యక్తిత్వ వికాస కార్యక్రమాలలో పంచుకునే జ్ఞానాన్ని, వ్యూహాలను లోతుగా అర్థం చేసుకుని, కనీసం 21 రోజులపాటు పూర్తి విస్వాసంతో దాన్ని ఆచరిస్తే మీ జీవితాలలో విజయం తేలికగా సాధించవచ్చు.
289. ధనం సంపాదించడంతో నీ కృషిని ఆపవద్దు. దయాగుణం, ధర్మబుద్ధి కూడా అలవర్చుకో.
290. మన జీవితాల్నేకాదు, మన చుట్టూ ఉన్నవారి జీవితాలలో కూడా కొంత వెలుగును నింపుదాం.
291. మనం మంచివారిగా ఉండగలగటం అంటే, చెడ్డవాళ్ళకి దూరంగా ఉండటానికి ప్రయత్నించడమే.
292. మీ హృదయాన్ని పూర్తిగా తెరచి ఉంచినప్పుడే, ఇతరుల హృదయాలను తాకగలుగుతారు.
293. తెలివైన వారు ప్రారంభంలోనే చేసే మొదటి పనిని, తెలివి తక్కువవారు చివరలో కూడా చేయడానికి సందేహిస్తూ ఉంటారు.
294. మనం ఏదైనా మంచి పనిని చేయగలం అనే మంచి ఆలోచన మనకు వస్తే చాలు, అదే మనకు చేయగల శక్తినిస్తుంది.
295. మంచి స్నేహితుల్ని పొందాలంటే, ముందుగా మనం మంచి స్నేహ భావాలు కలిగి ఉండాలి.
296. నీ లోపల ఉన్న శక్తిని వినియోగించడం ప్రారంభిస్తే చాలు, నీ జీవితం ఇప్పటికన్నా తప్పకుండా మెరుగ్గా తయారవుతుంది.
297. ఆపదలో అవసరాన్ని, బాధల్లో మనసును తెలుసుకుని సహాయపడేవాడే నిజమైన స్నేహితుడు.
298. నీ జీవితంలో జరిగిన విషయాలకు ఆందోళన పడవద్దు. అందులో నుండి ఆనందంగా జీవించడం నేర్చుకో.
299. ఎవరినైనా పదిమందిలో ప్రశంసించు. అవసరమైతే ఏకాంతంలో మందలించు.
300. చెడుఆలోచనలు రాకుండా జాగ్రత్త పడండి. మంచిబుద్ధితో శ్రద్ధపెట్టి మంచి ఆలోచనలవైపు దృష్టి సారించండి.
301. నిజాయితీ పరులను చూసి చాలామంది సహింసలేరు. ఎందుకంటే, ఎక్కువ శాతం అలా ఉండలేనివారే.
302. వ్యక్తిత్వం అన్నది మేధ కంటే గొప్పది. ఉన్నతమైన వ్యక్తిత్వం జీవించడం, అర్థవంతంగా ఆలోచించడం కూడా చేయగలదు.
303. మంచి బుద్ధులచేత, మంచి నడకల చేత, మంచిమాటల చేత మాత్రమే మంచిని పొందగలం.
304. వివేకవంతులకు మంచి పుస్తకమే అసలైన మిత్రుడు.
305. కష్ట సుఖాలు, మంచి చెడులు, ముళ్ళు పువ్వులు, దుర్మార్గుల సన్మార్గుల రంగుల పూలబుట్ట ఈ సమాజం.
306. మన లక్ష్యాలపై మనకు విశ్వాసం ఉండి, గెలిచి తీరాలన్న దృఢ సంకల్పం ఉన్నంతకాలం, విజయం మనకు లభించితీరుతుంది.
307. ఓర్పుకు మించిన కవచం లేదు. మంచి మిత్రునికి మించిన ఔషధం లేదు.
308. డబ్బుతో స్నేహితులను సంపాదించవచ్చేమో. కానీ, డబ్బు లేకుండా స్నేహితులను సంపాదించడమే గొప్ప.
309. సిద్ధికంటే సాధన ముఖ్యం. ఏమి సాధించావు అనే దానితోపాటు ఎలా సాధించావు అనేదే ముఖ్యం.
310. సృజనాత్మకంగా ఆలోచించేవారు మరొకరెవరికి నకలుగా ఉండాలని అనుకోరు. వారి మార్గం వారికి ప్రత్యేకమై ఉంటుంది.
311. సత్యాన్ని నిర్భయంగా చెప్పదలసినవారు దేని గురించీ సంకోచించనవసరం లేదు.
312. చెడు స్నేహితునితో సమయం గడపటం కంటే, ఒంటరిగా ఉండటం మేలు. ఒంటరిగా ఉండటం కంటే మంచి మిత్రునితో ఉండటం మరింకింత మేలు.
313. మనం తలపెట్టిన కార్యం అందరికీ మంచి చేసేది అయితే భగవంతుడు మనకు తోడుగా ఊంటాడు.
314. పాత “మీరు” గా ఉండటంకంటే, కొత్త “మీరు” గా మారుతూ ఉండటం అభివృద్ధిని చూచిస్తుంది. నిరంతరం మార్పుని ఆహ్హానిస్తూ ఉండాలి.
315. జీవితంలో కష్టాలనేవి ఉండకూడదని చాలామంది అనుకుంటారు. నిజానికి అలా అనుకోవడంవల్లే కష్టాలు కష్టంగా తోస్తాయి.
316. సంకల్పబలం ఉన్నవారు దేనికీ ఆందోళన చెందరు. జీవితంలో అభివృద్ధి చెందడానికి, శక్తిమంతులుగా అవ్వడానికి, విజయం సాధించడానికి ఇవే దోహదాలు.
317. అమ్మకానికి వచ్చింది కదా అని అవసరంలేని వస్తువును కొనకూడదు. అవసరమున్న వస్తువును కొనడానికి వెనుకాడకూడదు.
318. మీ జీవితంలో మీకు ఎన్ని ఎత్తు పల్లాలు, సమస్యలు, సంక్షోభాలు ఎదురైనప్పటికీ, మీ ఆలోచనే మీకు మూలశక్తి కావాలి.
319. పదిమంది స్నేహితులవల్ల కలిగే లాభం కన్నా, ఒక మంచి పుస్తకం ద్వారా కలిగే లాభం ఎక్కువ కావచ్చు.
320. జీవితాన్ని తీర్చిదిద్దగలిగే పుస్తకాలను ప్రతి ఇంటి గ్రంథాలయంలో పెట్టుకోవాలి.
321. కాలాన్ని సరిగా నిర్వహించుకున్న వ్యక్తి, మనసును సవ్యంగా నిర్దేశించుకుంటాడు.
322. శ్రమ ద్వారానే ఆరోగ్యదాయకమైన ఆలోచనలు వస్తాయి.
323. మీకు ప్రకృతి ప్రసాదించిన వాటికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఉండండి. మీకు సహాయం చేసిన వారికి సహాయపడండి.
324. మీరు గులాబీలను అందించటంపై ధ్యాస నిలపండి. మీ చేతికి కూడా కొంత పరిమళం అంటుకునే ఉంటుంది.
325. మీ సమయాన్ని మరొకరు వ్యర్థం చేయకుండా జాగ్రత్తపడండి. ముఖ్యంగా చెడు స్నేహితులతో అప్రమత్తంగా ఉండండి.
326. సూర్యోదయ, సూర్యాస్తమయ సమయాలలోని అందాన్ని, చంద్రోదయంలోని సౌందర్యాన్ని, చూసినప్పుడల్లా, సృష్టికర్తపట్ల ఆరాధనతో మన ఆత్మలు ఉప్పొంగి పోవాలి.
327. ఇతరుల కొరకు తనేమైనా చెయ్యగలనా, తనద్వారా పదిమందికి మేలు జరగాలని కోరుకునే వాడే ఉత్తముడు.
328. మనం నమ్మి పోరాడే క్రమంలో ఓటమిని చూసి సత్యాన్ని వదులుకోకూడదు.
329. ఎవరూ నీకు ప్రావీణ్యాన్ని సంపాదించి పెట్టలేరు. నీకై నీవే దాన్ని సంపాదించుకోవాలి.
330. పదిమందికీ మన గురించి మనమే చెప్పుకోవలసిన స్థితిలో ఉంటే, మనం సాధించాల్సింది ఇంకా ఉన్నదని అర్థం.
331. మనల్ని మనం సంసిద్ధం చేసుకోవడం కన్నా కష్టమైనదేదీ ఉండదని గ్రహించాలి.
332. పనిచేసే ప్రతిసారీ సత్ఫలితాలు రావు. కాని పని చేయకపోతే ఏ ఫలితం ఉండదు.
333. సొంత లాభం కంటే సమాజం గురించి కూడా ఆలోచించు.
334. వ్యక్తి అహాన్ని తగ్గించుకోవడమంటే వ్యర్థమైన అంశాలను ప్రక్కన పెట్టటమే. ఇదే మనిషి ఉన్నతికి సోపానంగా నిలుస్తుంది.
335. మనిషి జీవితంలో వచ్చే ప్రతిరోజూ క్రితం రోజుకన్నా, ఎంతో కొంత జ్ఞానాన్ని నేర్పుతుంది.
336. అన్నిటికీ సిద్ధపడినవారు ప్రతికూల సమయంలో సైతం మంచినే పొందగలుగుతారు.
337. అవమానాన్ని భరించి సర్దుకొనిపోయేవారిలో ఎంతో గొప్పతనం దాగి ఉంది.
338. విభిన్నంగా ఆలోచించు… వినూత్నంగా యత్నించు…అది వ్యాపారంలోనైనా, జీవితంలోనైనా…
339. బంగారపు ప్రతి పోగు ఎంత విలువైనదో, కాలపు ప్రతి క్షణమూ అంతే విలువైనది.
340. దురాశ, అసూయ, గర్వం ఈ మూడు ఎంతటి మనిషినైనా దహించివేస్తాయి.
341. ఒక దారిలో అవకాశం కన్పించకపోతే, మరొక దారిలో తప్పకుండా దొరికే అవకాశం ఉంటుంది.
342. ఆలోచనలు కూడా మొక్కలలాంటివే… వాటిని నీరుపోసి పెంచాలి. లేకపోతే అవికూడా వాడిపోతాయి!
343. ఎవరైనా తాము చేస్తున్న పనిని ప్రేమించాలి. అపుడు ఎటువంటి కష్టమైన పనైనా సరే సృజనాత్మక స్థాయికి చేరుతుంది.
344. ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. లేకుంటే మనసును చైతన్యంగా, స్థిరంగా ఉంచుకోలేం.
345. మంచివారు నిరంతరం తమశక్తిని పెంచుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు.
346. అథఃపాతాళానికి తొక్కేలా ఉండే మీ ఆలోచనలకు భయపడకండి. ఆ శక్తినంతటినీ ఆకాశానికి ఎదిగేందుకు వాడుకోండి.
347. ఇతరులను ప్రేమించగలిగినవాడే స్వేచ్ఛను ప్రేమిస్తాడు. తనను తాను ప్రేమించుకునే వాడే అధికారాన్ని ప్రేమిస్తాడు.
348. ఎదుటివారిలో మంచిని చూసిన రోజున నీలోమంచి పెరుగుతుంది. ఆ మంచిని పదిమందికి పంచినరోజున నీ జన్మ ధన్యమవుతుంది.
349. విమర్శలన్నింటిలో ఆత్మ విమర్శ అత్యుత్తమైనది.
350. జీవితం మధురమైనదే. అయితే, అది నీకు లభించే జీవిత భాగస్వామిపై ఆధారపడి ఉంటుంది.
351. గడ్డిమేసి ఆవు పాలిస్తుంది. పాలుతాగి మనిషి విషమౌతాడు. అది గడ్డి గొప్పతనమా… ఇది పాలదోషగుణమా…!!!
352. ఘనకార్యాలు సాధించడానికే భగవంతుడు మనను ఎన్నుకొన్నాడని విశ్వసించు. ఆ విశ్వాసమే ఘనకార్యాలని సాధించగల శక్తినిస్తుంది.
353. ఎక్కడ స్త్రీలు గౌరవింపబడుతున్నారో, అక్కడ దేవతలు ఆనందిస్తారు. తమ వరాలను కురిపిస్తారు.
354. లోభం అనే హీనగుణం ఉన్నవాడు తృప్తిగా అనుభవించలేడు.
355. పిల్లలనుంచీ, గొప్ప వ్యక్తులనుంచీ అంటే అందరినుంచీ మనం నేర్చుకోవలసింది చాలా ఉందని గ్రహించాలి.
356. దేశ పురోభివృద్ధి కోసం పాటుబడిన వ్యక్తులు అంతరించినా వారి ఆలోచనలు మాత్రం సజీవంగా స్ఫూర్తినిస్తూనే ఉంటాయి.
357. ఉపాధ్యాయుడు ఇస్తాడు. విద్యార్థి స్వీకరిస్తాడు. ఇవ్వడానికంటూ అతనివద్ద కొంత ఉండాలి. స్వీకరించడానికి ఇతడు సిద్ధంగా ఉండాలి.
358. గొప్ప పనులెప్పుడు సులభతరం కాదు. అందుకు సమయపాలన, సహనం, దృఢమైన సంకల్పం కావాలి.
359. కష్టాన్ని దూషించకు, ఆహ్హానించు, కష్టంలోంచి కొత్త మనుగడ, గొప్ప ఎదుగుదల పుట్టుకొస్తుంది.
360. వివేకవంతునికి సుఖం పాదాల దగ్గరే కనిపిస్తే, మూర్ఖునికి సుఖం దూరంగా కనిపిస్తుంది.
361. గడచిన ప్రతిరోజూ మనము ఏదైనా నేర్చుకొనేదిగా ఉండాలి.
362. సకాలంలో ప్రారంభించిన పనులు ఉత్తమ ఫలితాలను ఇస్తాయి.
363. నీ సరిసమానులతో మాత్రమే స్నేహం చెయ్యి.
364. ధర్మాచరణం తెలిసిన వ్యక్తికి అతిథి సామాన్యుడైనా పూజనీయుడే.
365. మనస్సును అదుపులో ఉంచుకోగల వ్యక్తియే మంచి ప్రవర్తన కలిగి ఉంటాడు.
366. నీకన్నా గొప్పవారిని చూసి అనుసరించు, తక్కువ వారిని చూసి సాయం చెయ్యి.
367. చెయ్యగలిగే శక్తి ఉన్నవాడికంటే, చెయ్యాలనే కోరిక ఉన్నవాడు ఎక్కువ చేస్తాడు.
368. జీవితంలో ముందడుగు వేయడానికి సహకరించేవి – అవసరం, ఆసక్తి.
369. స్వార్థమును విడిచి ఇతరులకు మేలు చేసే వారిని ఉత్తమ పరోపకారులన్నారు. తమ యొక్క మేలు చూసుకుంటూ… ఇతరులకు కూడామేలు చేయడానికి ప్రయత్నించేవారు మధ్యములు. తమ మేలు కొరకు ఇతరులకు కీడు తలపెట్టేవారు అధములు.  

           ”అక్షర రూపము దాల్చిన ఒకేఒక్క సిరాచుక్క – లక్ష మెదళ్ళకు కదలిక”  - కాళోజి


నీ”వై” నా “వై”

ఏదైనా కానీ, ఏమైనా కానీ మరణం దాకా ప్రేమించడమే జీవితానికి అర్ధం
ప్రేమ తోడుంటే తుఫానులైనా లోకం ఏమనుకున్నా ప్రేమే, ప్రేమే పరమార్ధం.
ప్రేమించడమంటే అంత సులభం కాదు! నిన్ను నువ్వు అర్పించుకోనిదే అది అర్ధం కాదు
ప్రతి క్షణం హృదయాన్ని వెలిగించే వుండాలి ! వేరే ఆలోచనకు తావే లేదు.

అటు అలజడి, ఇటు అలజడి
ఎటు అడిగిడితే అటు గుండె సడి
తణువు అణువణువు భావాల పూల పుప్పొడి
మనువులో వెన్నెల నిప్పుల అనుభవాల వేడి
హృదయంలో మల్లెల మాటల సువాసనల తడి.

మంచివారు ఎప్పుడూ ఇలాగే వుంటారేమో!
పూలలో పరిమళాలై దాగివుంటారేమో!
దేశమంతా గుండెతడి కోల్పోతున్న ఎడారి
హృదయదాహంతో సాగుతున్న నేనో బాటసారి
నీవు నాకోసమే పొంగిపొర్లే గోదావరి.

నమ్మకం ఒకరోజు అపనమ్మకం అవుతుందేమో
నిమ్మలించడానికి హృదయాన్ని కాస్త సిద్ధం చేసుకుంటా!
గుండెలయ నాకు చెప్పకనే తప్పుతుందేమో జాగ్రత్తగా మెలకువనై వుంటా!
ప్రేమించడం అంత సులభంకాదని తెలుసు.

అందుకే కన్నుల్లో కన్నీటిని జీవితాంతం నిలువ వుంచుకుంటా!
కవిత్వ రహస్యం తెలిసిన వారికే ప్రేమించడం చేతనవుతుందని తెలిసి
నీకోసం జీవితకాలం ఎదురుచూస్తుంటా!

ఉదయం సాయంత్రం కాలం ఊపే ఊయల
ప్రేమ నిండిన హృదయం తరగని చెరగని
ధూప దీప నైవేద్యం అందుకునే కోవెల
తెల్లవారకనే మీకోసం కవితా గానం చేస్తుంది ఈ కోయిల.

పొద్దుపై వెలుగు కవిత లిఖిస్తూ సూర్యుడు
చీకటిపై వెన్నెల కథ రచిస్తూ చంద్రుడు
పగలూ రేయి జీవితాన్ని రచిస్తూ మీ కవి మిత్రుడు

నీతి వాక్యాలు

1. చేసిన తప్పును సమర్ధించుకోవడంకంటే, దాన్ని సరిదిద్దుకునేందుకు తక్కువ సమయం పడుతుంది

2. జీవితం ఓ యుద్ధభూమి, పోరడితే గెలిచేందుకూ అవకాశం ఉంటుంది, ఊరక నిలుచంటే మాత్రం ఓటమి తప్పదు
3. వేసిన సంకెళ్ళను తీసివేయమని అవి వేసిన వారినే ప్రాధేయపడేకంటే సత్తా పెంచుకుని వాటిని స్వయంగా ఛేదించుకోవడం మంచిది
4. వివేకి ఎన్నడూ జరిగిన నష్టాన్ని తలచుకుని దిగులుపడడు, దాన్ని ఎలా భర్తీ చేయాలా అని మాత్రమే ఆలోచిస్తాడు
5. అంధుడికి అద్దం ఇవ్వడం ఎంత నిష్ప్రయోజనమో మూర్ఖుడికి మంచిని బోధించడమూ అంతే
6. సలహా అనేది నీ స్నేహితులను కేవలం సంతోషపెట్టేదిగా కాదు, సహాయపదేదిగా ఉండాలి
7. వైఫల్యాన్ని పరాజయంగా కాక ఆలస్యంగా లభించనున్న విజయంగా భావించేవారే విజేతలవుతారు
8. కోపంగా ఉండటం అంటే మండుతున్న బొగ్గుముక్కను ఇతరులపై వేయటానికి సిద్ధపడటమే, కానీ వారిపై వేసేలోపల అది మన చేతిని కాల్చుతుందని మరచిపోకూడడు
9. వాడని ఇనుము తుప్పు పడుతుంది, కదలని నీరు స్వఛతను కోల్పోతుంది, అలాగే బద్ధకం మెదడును నిస్తేజం చేస్తుంది
10. కష్టాలవల్ల కలిగే క్షోభను ఉన్నతుడు మాత్రమే తట్టుకోగలడు, సానమీద రాపిడిని మాణిక్యమే సహించగలడు కానీ మట్టిగడ్డ కాదు
11. అసమర్ధుడికి అడ్డంకిగా తోచే రాయి సమర్ధుడికి సోపానం అవుతుంది
12. మేధావులు తమ మేధస్సును చదువుకోవడానికి ఉపయోగించే లాంతరులా కాక అందరికీ దారి చూపే వైట్ హౌస్లా వినియోగించాలి
13. అమ్మ... ప్రేమకు ప్రతిరూపం. వదిలంగా కాపాడుకో. ఆమెను పోగొట్టుకున్నప్పుడు కానీ ఆ లోటు ఎంత దుర్భరమో తెలీదు
14. ఔన్నత్యమంటే కోరికలను చంపుకోవడం కాదు, వాటిని అదుపులో ఉంచుకోవడం
15. అనంతమైన దుఖాఃన్ని చిన్న నవ్వు చెరిపివేస్తుంది, భయంకరమైన మౌనాన్ని ఒక్క మాట తుడిచివేస్తుంది
16. ఎప్పుడూ కింద పడకపోవడం కాదు, వడిన ప్రతిసారీ తిరిగిలేవడమే గొప్ప
17. కలలు కనేవారికి గుండెధైర్యం మెండుగా ఉండాలి, కలల తీరం చేరాలంటే నిప్పుల బాటలో నడవాలి మరి
18. మనం త్వరగా నిద్రలేచినంత మాత్రాన సూర్యుడు ముందుగా ఉదయించడు
19. ఉపాధ్యాయుడు నిరంతరం నేర్చుకుంటూఉంటే తప్ప ఇతరులకు బోధించలేడు, దీపం తాను వెలుగుతూ ఉంటే తప్ప మరో దీపాన్ని వెలిగించలేదు
20. అధికారాన్ని ప్రేమించడమంటే నిన్ను నువ్వు ప్రేమించుకోవడం, స్వేచ్చను ప్రేమించడమంటే ఇతరుల్ని ప్రేమించడం
21. విధ నేర్చుకునే వాడు గతంలో తానెమీ నేర్చుకోలేదని భావించి కొత్త విషయాలు నేర్చుకుంటూ ఉండాలి, గుణపాఠాల విషయంలో మాత్రం పాత అనుభవాల్ని నిత్యం పునశ్చరణ చేసుకుంటూ ఉండాలి
22. మాట్లాడాల్సిన చోట మౌనం వహించడం, మౌనంగా ఉండల్సిన చోట మాట్లాడటం... రెండూ తప్పే
23. మనకోసం మనం చేసేది మనతోనే అంతరించిపోతుంది, పరులకోసం చేసేది శాశ్వతంగా నిలుస్తుంది
24. నిన్నటికంటే నేడు నీ వివేకం పెరగకపోతే, నీ జీవితంలో ఓ రోజు వ్యర్ధమయిపోయిందని తెలుసుకో
25. తప్పు చేశారని ప్రతి ఒక్కరినీ ద్వేషిస్తూపోతే, ప్రేమించడానికి ఎవరూ మిగలరు
26. అడ్డంకులకు కుంగిపోతే అపజయం, వాటిని అనుభవాలుగా మలచుకోగలిగితే విజయం
27. స్నేహాన్ని నటించే మోసగాడికన్నా, ద్వేషాన్ని వెలిగక్కే శత్రువు మేలు
28. నాలుకను అదుపులో పెట్టుకోవడమే నిజమైన యోగసాధన
29. మల్లెలకీ మంచి గంధానికీ ప్రచారం అనవసరం
30. నయంకాని వ్యాధికన్నా మరణం, దుష్టులతో స్నేహంకన్నా ఒంటరితనం, యోగ్యతలేని పొగడ్తకన్నా నింద,... మేలైనవి.

రధ సప్తమి - 30.01.2012

సాక్ష్యాత్తు శ్రీ మన్నారాయణ స్వరూపుడైన శ్రీ సూర్య భగవానుడు సాక్షాత్తు శ్రీమన్నారాయణ స్వరూపుడై శ్రీసూర్య భగవానుడు జన్మించిన మాఘశుద్ధ సప్తమి పర్వదినమే రధ సప్తమి. వివిధ దేశాలు, విభిన్న వ్యక్తులు, అనేక కుల మతాలు, రకరకాల జీవ రాసులు, ఇలా ఎన్నో, ఎన్నెన్నో రకాలు ఉన్నా, అందరికీ, అన్నిటికీ..., ప్రపంచ మంతటికీ, ఉనికినీ, మనుగడనీ,ప్రసాదించేది ఒక్క సూర్య భగవానుడే. ఆయనే మనకు ప్రత్యక్ష దైవం. జీవుల చావు పుట్టుకలకు, పోషణకు, కాల నియమానికీ, ఆరోగ్యానికీ, అన్నిటికీ ఆ సూర్యుడే. సూర్యుడు లేనిదే జగత్తు లేదు. సూర్యుడు అతిధి కశ్యపుల కుమారుడు. అందుకే ఆయన ఆదిత్యుడు. కర్మ సాక్షి ఐన మన సూర్య భగవానుడు, కుసుమ వర్ణంతో ఉంటాడు. ఉదయం బ్రహ్మ స్వరూపం మధ్యాహ్నంతు మహేశ్వరం సాయంకాలే స్వయం విష్ణుః త్రిముర్తిస్తూ దివాకరః సూర్యుడు దక్షిణాయణం ముగించుకుని, ఉత్తరాయణంలో ప్రవేశించటానికి సూచనగా మనం రెండు పర్వదినాలను జరుపుకుంటాం. ఒకటి సంక్రాంతి రెండవది రథ సప్తమి. సప్తమి సూర్యుని జన్మ తిధి. ఉత్తరాయణం ప్రారంభానికి సూచనగా మాఘ శుద్ధ సప్తమి నాడు, జరుపుకునే రథ సప్తమి సూర్య సంబంధమైన పండుగ. జపా కుసుమ సంకాశం, కాశ్యపేయం మహాద్భుతం తమోరిం సర్వ పాపఘ్నం 






ప్రణతోస్మి దివాకరం 

నేడు భీష్మ ఏకాదశి _ 03.02.2012

నేడు భీష్మ ఏకాదశి- శ్రీ విష్ణు సహస్ర నామ జయంతి మాఘ శుక్ల ఏకాదశినే భీష్మ ఏకాదశి అంటాము. ఈ రోజునే విష్ణు సహస్ర నామం ఉద్భవించింది భగవద్గీత శ్రీకృష్ణుడు నేరుగా చెప్పాడు, శ్రీవిష్ణు సహస్రనామాల్ని భీష్ముడి ద్వారా చెప్పించాడు. తండ్రి సుఖం కోరి సింహాసనాన్ని వదులుకుని ఆజన్మ బ్రహ్మచర్యం పాటించిన మహాపురుషుడు భీష్మాచార్యుడు. అంపశయ్యపై నుండే విష్ణుసహస్రనామ కీర్తన చేసి ఆ స్వామికి ఇష్టమైన మాఘశుద్ధఏకాదశిని తన పేరిట బహుమానంగా పొందిన పురాణ పురుషుడు. అంత్యకాలంలో హరినామస్మరణ చేస్తేనే మోక్షం లభిస్తుందని ప్రసిద్ధి. అలాంటిది ఆ వాసుదేవుణ్ణే ఎదురుగా పెట్టుకుని వేయినామాలతో కీర్తించిన అదృష్టవంతుడు భీష్ముడు. అవే అనంతరకాలంలో విష్ణుసహస్రనామాలుగా ప్రసిద్ధికెక్కడంవిశేషం. అందుకే భీష్ముడు మరణించిన మాఘశుద్ధ అష్టమినాడు, తర్వాత వచ్చే ఏకాదశినాడు విష్ణుసహస్రనామం పఠిస్తే సకల శుభాలు చేకూరుతాయని భావిస్తారు