3, అక్టోబర్ 2013, గురువారం

సుస్వరాలను సోయగాలలో నింపుకున్న ఓ సుందరీ...

కవిత్వం కుదరక కష్టం కలిగించే కమనీయ
అందం నీది
రచనలకే రాగాలు నింపిన రమణీయఅందం నీది
అక్షరాల అమరికలకు అంతుపట్టని అందం నీది
చెలియా చేతి రాతలకే చెమటలు పట్టించే
అందం నీది
నీ కనుల కమలాలను .. ఏమని వర్ణించను
ఎలా మొదలు పెట్టను .. ఎలా ముగించను
సుస్వరాలను సోయగాలలో నింపుకున్న ఓ
సుందరీ...


||అందం||


ఉషోదయానికి విహరించే పక్షులు అందం
అర్దోదయానికి చల్లని చెట్ల నీడలే అందం
సంధ్యా సమయానికి వచ్చే హరివిల్లులు అందం
నిశాసమయానికి వెలుగులు చిందే తారకలు అందం
ఆకాశానికి సింధూర వర్ణ కాంతులు అందం
చంద్రోదయానికి విచ్చే కమలాలు అందం
చిరుగాలి అల్లర్లకు పచ్చికబయళ్ళ నాట్యం అందం
చిరుజల్లులు వేళ మట్టి సువాసనలు అందం
చిటపట చినుకులకు పసిపిల్లలు ముద్దులోలికించే
నవ్వులు అందం
జలపాతాల హోరుకు ఝరులు అందం
నదీ ప్రవాహంలో పడవ ప్రయాణం అందం
తుమ్మెద ఝుంకారంలో వినబడే శబ్దం అందం
రంగు రంగుల పుష్పాలకు మకరందమే అందం
మనిషి మనసుకు మంచితనమే అందం

||దసరా మాటంటే సరదాల పూలతోటే ||

పది రోజుల పండగ
పదిలంగా సెలవలుండగా
పేడ అలుకుల
పసుపు గడపల
పచ్చని పల్లె మన అందరికీ
స్వాగతం పలుకుతుండగా
పచ్చని చిలుకలు పరుగులు పెడుతుండగా
పురాతన ఆచారాలను నవ
తరాలకు పరిచయం చేయగా
పరివారంతో కళకళాడింది ప్రతీ మండువా
పిండి వంటలతో పౌష్టికత్వం పెరిగెను అండగా
పిల్లల అల్లర్లతో చెలరేగింది ధ్వని మెండుగా
పందిళ్ళు అన్నీ పడుచుల చిరునవ్వులతో నుండగా
పీతాంబరాలలో జనమంతా మెరవగా
పంచపల్లవాదులతో లోకపావని పీఠం అలంకరించగా
పరమేశ్వరిని ప్రతీ నిత్యం ఒక్కో అవతారంలో
కొలువైఉండగా
ప్రతీ ఒక్కరు కుంకుమతతో పూజించగా
పసందైన ప్రసాదాలతో కడుపు నిండగా
జరుపుకునేదే కన్నుల పండుగా దసరా పండగ
అందుకే
దసరా మాటంటే
సరదాల పూలతోటే
సాస్త్రీయతను,సాంప్రదాయాన్ని,విజ్ఞాన్ని కలిపి
పెద్దలు ఏర్పరిచిన పండుగ
స్త్రీ తత్వాన్ని,ధైర్యాన్ని తెలియ చెప్పే పండుగ
నీ చేతిలోని జీవనాయుధానికి జయ సంకల్పంతో
పూజచేసే పండగ
విజయానికి సంకేతంగా విజయ భవానీకి జరిపే వేడుక
ఈ పండుగ
ఆరోగ్యాన్ని,ఆనందాల ఐశ్వర్యాన్ని చేకూర్చే
పండుగ
అందుకే
దసరా మాటంటే
సరదాల పూలతోటే ..