30, మార్చి 2013, శనివారం

రెండు గా బతకాలేమో


రెండు గా బతకాలేమో మనమెప్పుడూ వింతగా
గతంలో నేనున్నపుడు నువు నా భవిష్యత్తులో దాక్కున్నావు
నువ్వే నా భవిష్యత్తు అనుకుంటే.. గతంలోకి తొంగిచూస్తున్నావు
రెండు గా ఉండాలేమో మనమిప్పుడు కొత్తగా
నిన్ను చూడాలని చీకట్లను దాటి వస్తే నీ ఎండ నామీద కాస్తున్నావు
నే వదిలిపెట్టిన నీడలన్నిటినీ నీ నెత్తిన బండలా మోస్తున్నావు
రెండు చోట్ల గడపాలేమో మనమెప్పుడూ రోజంతా
రూకలవేటలో బయట నేనుంటే గడపలోన పీడకలల్ని కంటున్నావు
రహదారి వెంట నా పరుగైతే అడ్డదారిలో నాకై ఎదురుచూస్తున్నావు
రెండుగా కనబడాలేమో మనమెప్పుడూ
భయాన్ని కప్పుకొని నా రక్షణలో నువ్వూ
ప్రేమని కప్పుకొని నీ నిరీక్షణలో నేనూ
నీతో నడవాలనీ, నీకై నిలిచిపోవాలనీ
రెండువైపులా ఊగుతోంది నా మనసు.
ప్రేమకీ జీవితానికీ మధ్య ఏది ఏమైనా తేడా ఏముంది?

నమ్ముతావో నమ్మవో


నమ్ముతావో నమ్మవో నీ ముందు జరిగేది
నమ్ముతావో నమ్మవో నీవు చూసేవి
నమ్ముతావో నమ్మవో మండే సూరీడ్ని
నమ్ముతావో నమ్మవో రాత్రి తారల్ని
నమ్ముతావా ఎగిరే పిట్టల్ని
నమ్ముతావా కదిలే మేఘాల్ని
నమ్ముతావా గాలి కెరటాల్ని
నమ్ముతావా కాంతికిరణాల్ని
నమ్ముతావో నమ్మవో అన్న మాటల్ని
నమ్ముతావో నమ్మవో నీవు విన్న వాటిల్ని
నమ్ముతావో నమ్మవో చివరి వాక్యాల్ని
నమ్ముతావో నమ్మవో తిరిగే నాట్యాన్ని
నమ్ముతావా కాంతిని దృశ్యాన్ని
నమ్ముతావా వెలుగే కాలాన్ని
నమ్ముతావా స్పర్శ ని రుచిని
నమ్ముతావా అంతా.
నమ్ముతావో నమ్మవో అంతరాత్మని
నమ్ముతావో నమ్మవో సంతోషపు తన్మయత్వాన్ని
నమ్ముతావో నమ్మవో కీర్తిని పరంధాముడ్ని
నమ్ముతావో నమ్మవో ఆ ఆలోచనల్ని
నమ్ముతావా పైనున్న ఆకాశాన్ని
నమ్ముతావా ప్రేమ పాశాన్ని
నమ్ముతావా దివిని భువినీ
నమ్ముతావా చావుపుట్టుకల్ని
నమ్ముతావా జీవితాన్ని
నిజమైన నమ్మకం తో కళ్ళు తెరిచి చూడు
ద్వారాల్నీ తెరిచివుంచు కాంతిని నింపుకో
నమ్ము నమ్మకం నిను నిలబెడుతుంది

ఉదాత్తం నాకు కవిత్వం


ఉదాత్తం నాకు కవిత్వం


రాళ్ళు ఏరుతుంది అమ్మ బియ్యంలో మౌనంగానే..
అన్నం వండటం ఒక పవిత్ర కార్యం
పనిచేస్తాడు నాన్న ఇల్లుగడవాలని
సాలీడు శ్రధ్ధతో గూడుకడుతున్నట్టు.
సూదిమందు గుచ్చుతుంది నర్సమ్మ
రోగం నయమవ్వాలని అందరి ప్రార్థన
నేర్చేటప్పుడు పంతులుగారు ధ్యానంలోనే ఉంటారు
అదే అమ్మ ఇంటి శుభ్రంలో బల్లుల్ని తరుముతుంది
తప్పుచేసిన పిల్లలపై ఉరుముతుంది.
అదే నాన్న విసిగిస్తే కసురుతాడు,
చెయ్యీ విసురుతాడు
కుట్లేసే వేళ డాక్టరు మత్తిచ్చి మగతలోకి నెడతాడు
మాత్ర మింగకపోతే మరి కోప్పడడూ!!..
పాఠం చెప్పేటందుకు గొంతెత్తి వినిపిస్తారు మాస్టారు
విసిగిస్తే ఆకతాయికి ఒకటో రెండో అంటిస్తారు
ఎంత పనికి అంత బలమే చూపిస్తారెవరైనా..
మరి నువ్వేంటీ!..
కవిత్వం పేరు చెప్పి ఏమైనా చేస్తానంటావ్
ఉత్తర కుమారుని వేషం వేస్తావ్..
చీత్కారాలూ, దూషణలూ nostalgia నా నీకు!!
నాకంటే పెద్దే కావచ్చు అన్నిటా.. నువ్వు..
తమ్ముడ్ని చేరదీసినట్టు చెప్పరాదూ..
పక్కింటోడ్నే తిట్టచ్చు నువ్వు, మనసు నలిగి..
కడుపు మండే తిట్లెందుకు.. నీ నోరూ పాడవదూ!!
కవిత్వం నీకు తల్లే కాదనను
నాకో, మరెవరికో రంకంటగట్టడం
ఏపాటి మానవీయత!!
రగిలిపోయి కవిత్వం రాస్తున్నావా..
ఎవరి అమ్మను అపహాస్యం చేస్తున్నావు!!
హత్తుకునే మెత్తని మనసు నీకు లేనప్పుడు
కవిత్వం పసిపాపను కలనైనా తాకకు
కోయడం నీ అవసరమైనప్పుడు అది
ప్రసవానికో, రసాస్వాదనకో అన్నట్లుండాలి
కసాయి కత్తులతో తుత్తునియలు చేయకు
రత్యానంతరానుభూతి నీకు తప్పనిసరి ఐనప్పుడు
అది శృంగార పరమావధిగాసాగాలి..
మరోలా ఉండకూడదని మాటల్లో చెప్పాలా..
నీకు తెలియనిది కాదు మిత్రమా..!
మేడిపండులోనికి కవిత్వాన్ని చొప్పించకు
ప్రియతమా..ఆస్వాదనకు దూరమైపోతాం

13, మార్చి 2013, బుధవారం

పారిపోయిన కాలాన్ని పట్టలేనని తెలుసుకున్నాను


నా జీవితంలో నవ్వులు మాత్రమే లేవు..
కష్టం కలిగినప్పుడు కరిగిన కన్నీరు తెలుసు..
ఆనందంలో ఆశల జలపాతం తెలుసు.....

గెలుపులో ఆనందం తెలుసు..
ఓటమి ఇచ్చిన కన్నీటి బాధ తెలుసు..

ధైర్యం చెప్పే మనసులు తెలుసు..
మనసుకు గాయం చేసే మనుషులు తెలుసు..

అమ్మ ఇచ్చిన నమ్మకం తెలుసు..
నాకోసం నాన్న చేసిన కష్టం తెలుసు..
నాకోసం తపించే ప్రేమ తెలుసు..

ఆశల కోటకు దారులు వెతికే వేళ..
ఎదురైన అడియాశల సౌధాలెన్నో తెలుసు..
ఆశల సాగరంలో ఈదుతూ..
కలలు చేరుకోవాలుకునే నాకు..
కల్లలైన కధలెన్నో తెలుసు..

ఓటమి అంచును దాటిన నాకు..
గెలుపుకు వెతికే దారులు తెలుసు..
పడిన ప్రతిసారి పైకి లేవడం తెలుసు.

నేను గెలవటంలో ఓడిపోవచ్చు కానీ..
ప్రయత్నించడంలో గెలుస్తున్నాను..
ప్రయత్నిస్తూ గెలుస్తాను..
గెలుస్తాను.వస్తున్నా ...

ఎదురుచూపులో ఎన్ని ఋతువులు కరిగిపోయాయో
నా కన్నీళ్ళల్లో ఎన్ని కలలు జారిపోయాయో

మనసు మెదడు తో యుద్దం చేస్తుంది
ఫలితమే ఈ నిదురలేని రాత్రి

అయితేనేమిలే...
పారిపోయిన కాలాన్ని పట్టలేనని తెలుసుకున్నాను...... యన్.శేషగిరి

12, మార్చి 2013, మంగళవారం

నీటిని పుట్టింటికి పంపాడు..


సాగరుడు
తన ప్రియ పుత్రిక నీటిని
సూర్యుడి మధ్యవర్తిత్వంతో
ఎంతో ఉన్నత సంబంధమని సంబరపడి
మేఘానికిచ్చి
పెళ్ళి చెసాడు..
కట్నకానుకలుగా
తన గర్భంలోంచి
రత్నాలు, ముత్యాలు ఇచ్చాడు..
అయినా -
పెళ్ళి విందులో
ఉప్పు నీళ్ళు ఇచ్చారని
అలిగిన మేఘం
నీటిని
పుట్టింటికి పంపాడు..

(అమ్మ చెప్పిన చిన్ననాటి కథ.. కొంచం మార్చి)