21, ఏప్రిల్ 2012, శనివారం

నేను…
ఎన్నో తప్పులు చేసుండొచ్చు..
ఎందరినో నొప్పించి ఉండొచ్చు…
భాధపడి ఉండొచ్చు…
భాధపెట్టి ఉండొచ్చు…
కన్నీరు కార్చుండొచ్చు…
ఓదార్చి ఉండచ్చు…
ధైర్యం ఇచ్చుండచ్చు…
దౌర్జన్యం చేసుండచ్చు…
కాదు అనలేక అవునని అనుండొచ్చు..
అవును అనాలని ఉన్నా కాదనుండచ్చు…
నిజాలని దాచుండొచ్చు…
అబద్దాలు చెప్పుండొచ్చు…
ఏది చేసినా..
ఎన్ని చేసినా..
నేనేంటో నాకు తెలుసు..
కన్నీటికి కరిగిపోవడం తెలుసు…
కోపంతో రగిలిపోవడం తెలుసు…
కరుణ కురిపించడం తెలుసు…
కరుకుగా మాట్లాడడం తెలుసు…
ఎన్నెన్ని నిజాలు కాల్చేస్తున్నా బయటకి నవ్వడం తెలుసు..
నవ్వీ నవ్వీ అలసిపోయి కన్నీటిలో కలవడం తెలుసు…
నాకు స్నేహం తెలుసు…
నాకు ప్రేమ తెలుసు…
ఆలోచనలని అదుపు చెయ్యడం తెలుసు…
ఆలోచనల్లో బ్రతికెయ్యడం తెలుసు…
చెడ్డ చేయ్యలనే ఆలోచన దరికి కూడా రానివ్వని తెలుసు…
పొరపాటు చేసానని తెలిసిన వెంటనే ఒప్పుకుంటానని నాకు తెలుసు…
నా అనుకున్న వారి కోసం నేను నన్ను మరచిపోతానని తెలుసు…
నేను మంచిని కాకపోవచ్చు..కాని చెడుని కాదని తెలుసు..
చలా తప్పులు చేసుండచ్చు…అవి తెలిసి చెయ్యలేదని తెలుసు…
అవి మళ్ళి చెయ్యలేనని తెలుసు..!!!
నాకు నేనేంటో తెలుసు..!!!
నేను మారుతున్నాని తెలుసు…మారుతుంటానని తెలుసు…
కాని ఆ మార్పు మంచికే అని తెలుసు…
ఆ మార్పు మంచిదే అని తెలుసు..!!!
ఇన్నాళ్లూ చలితో బిగదీసుకుపోయిన కోకిలమ్మ
గొంతు సవరించుకుని వేసవికి సన్నద్ధమవుతోంటే… నేనేమీ తక్కువ తినలేదంటూ

కోకిలమ్మకు ఆశ్రయం ఇచ్చే చెట్లు కూడా
ఆకులన్నింటినీ రాల్చేసుకుని,
పచ్చని పెళ్లికూతురిలా, చిగుర్లు తొడిగి
వేసవికి చల్లటి స్వాగతం చెప్పేందుకు
బిరబిరా సృష్టికార్యాన్ని నెరవేరుస్తున్నాయి… అంతకుముందుగా..

కోకిలమ్మ ఓ చెట్టుపై వాలి రాగాలు తీస్తోంటే…
గలగలమంటూ ‘పండు’టాకులు చప్పుడు చేశాయి
ఓహో ఇదేంటి.. నా పాట కంటే,
వీటి చప్పుడే కమ్మగా ఉందే అనుకుంటూ
ఓ చెవి అటు పారేసింది కోకిలమ్మ పండుటాకులున్న కొమ్మకు పక్కగా మరో కొమ్మ

ఆ కొమ్మకొక చిన్న రెమ్మ
ఆ రెమ్మకొక చిన్న చిగురుటాకు
చల్లగాలి జోలపాటతో నిద్దరోయిన దాన్ని
సూర్య కిరణాలు వెచ్చగా మేలుకొలిపాయి…
ఒళ్లు విరుచుకుని కిలకిలమంటున్న చిగురుటాకును
సన్నగా, బాధగా ‘పండు’టాకుల పాట తాకింది
పాటను విన్న చిగురుటాకు ఫక్కున నవ్వింది దాంతో ‘పండు’టాకులన్నీ ఇంకా గట్టిగా పాడసాగాయి

చిగురుటాకు కూడా మళ్లీ మళ్లీ నవ్వసాగింది
ఇంతలో ఓపిక నశించిన ఓ పండుటాకు…
“ఎందుకే ఆ మిడిసిపాటు” అంటూ
చిగురుటాకును నిలదీసింది..
మిడిసిపాటు ఎందుకుండదు..
నేనేమీ మీలా పసుపుపచ్చను కాదు…
నున్నగా నవనవలాడే పచ్చనాకును
ఇకపై పువ్వులు పూస్తాను..
పండ్లు కాస్తాను… అంటూ
ఆపకుండా చెప్పుకుపోతోంది పచ్చనాకు.. అలా చెబుతూ, చెబుతూ

ఇక ముందుకెళ్లటం సాధ్యంకాక…
ఓ చోట చటుక్కున ఆగిపోయింది…
వెంటనే పండుటాకులు అందుకున్నాయి
“ఏం ఆపేశావేం? కానీ…?” రెట్టించాయి
“మరీ.. మరీ…” గొణుక్కుంటోంది పచ్చనాకు… తానూ ఏదో ఓరోజున ‘పండు’టాకు

అవక తప్పదని అర్థమైంది ‘పచ్చ’నాకుకు…
దాంతో మనసు భారంకాగా… తలవాల్చేసి,
పండుటాకులకేసి దీనంగా చూసింది
ఇందాకటిలా కాకుండా…
‘పండు’టాకుల పాటలోని ఆర్తి
మనసుని పిండేయగా…
పండుటాకులను సగర్వంగా సాగనంపుతూ
సన్నగా పాటనందుకుంది…
ఇదంతా కళ్లారా చూసిన కోకిలమ్మ
పచ్చనాకుతో కలిసి కోరస్ ఇచ్చింది….!!!